ధోనిని తప్పించిన BCCI : ట్విట్టర్‌లో #ThankYouDhoni ఫ్యాన్స్!

  • Publish Date - January 16, 2020 / 01:15 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసింది.

ఈ కాంట్రాక్టు లిస్టులో ధోని పేరు లేకపోవడంతో అభిమానులను షాక్ గురిచేసింది. ధోనీతో పాటు ఇతర ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడిని కూడా బీసీసీఐ తమ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి తప్పించింది. 
Read Also :సాగనంపినట్టేనా..? : ధోనికి బీసీసీఐ బిగ్ షాక్

ఈ ఏడాది కొత్త కాంట్రాక్టు జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా ఏ+ కేటగిరిలో కొనసాగుతున్నారు. కొత్త ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితాను బీసీసీఐ ప్రకటించిన వెంటనే ట్విట్టర్ వేదికగా ధోని అభిమానులు ‘#ThankYouDhoni’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. 

ధోని అభిమానులు ట్విట్టర్ వేదికగా ‘అయితే.. ఓ యుగం ముగిసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల నుంచి ధోనిని బీసీసీఐ తప్పించింది. ఇక రాంచిలో లేదా వైజాగ్ లో ఒక మ్యాచ్ సెట్ చేయండి. ఎక్కడైతే ధోనీ తన చివరి వన్డేలో 145 పరుగులతో అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ గా ఎదిగాడో అక్కడికే పంపేయండి #ThankYouDhoni అనే హ్యాష్ ట్యాగ్‌తో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రపంచ కప్ 2019లో న్యూజిలాండ్ తో  జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఓడి భారత్ నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ధోనీ దాదాపు 6 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఎన్నో రోజుల నుంచి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తన రిటైర్మెంట్ విషయంలో ధోని ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీ త్వరలో వన్డే కెరీర్ కు వీడ్కోలు చెప్పనున్నట్టు హింట్ ఇచ్చారు. మరోవైపు అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్‌లో ధోనీ ఆడుతాడని శాస్త్రి తెలిపారు.