RCB vs GT : ఏదైనా.. రెండే.. ఇదేం సిత్రమో..
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ, గుజరాత్ జట్లు (RCB vs GT)తలపడనున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- May 31, 2026 / 09:05 AM IST
Today IPL 2026 final match between Royal Challengers Bengaluru and Gujarat Titans
RCB vs GT : రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఎవరు కప్పు సొంతం చేసుకున్నా కూడా అది వారికి రెండో ట్రోఫీ కావడం విశేషం. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ గతేడాది(2025) ఆర్‌సీబీ విజేతగా నిలవగా.. లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఏడాదే (2022) గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
క్వాలిఫైయర్-1లో గుజరాత్‌పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, డిఫెండింగ్ ఛాంపియన్‌గా వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టి ఫుల్ జోష్‌లో ఉంది ఆర్‌సీబీ. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్, రజత్ పాటిదార్‌లు ఫామ్‌లో ఉండడం ఆర్‌సీబీకి అతి పెద్ద బలం. వీరితో పాటు టిమ్ డేవిడ్ కూడా ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగితే బ్యాటింగ్‌లో ఆర్‌సీబీకి తిరుగు ఉండదు.
Vaibhav Sooryavanshi : వీడు మామూలోడు కాదు.. వైభవ్ బ్యాటా మజాకానా.. 12 కోట్లు..
భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లు మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నారు. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ జోడి మరోసారి విజృంభిస్తే.. ఆర్‌సీబీ కప్పు కొట్టడం నల్లేరుపై నడకే. మిడిల్ ఓవర్లలో ఎలాగూ కృనాల్ పాండ్యా పరుగులను కట్టడి చేస్తున్నాడు. గుజరాత్ టాప్-3 బ్యాటర్లు.. శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్‌లను పవర్‌ప్లేలోనే ఔట్ చేస్తే ఆర్‌సీబీకి తిరుగుఉండదు.
గుజరాత్ తక్కువేం కాదు..
గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. క్వాలిఫైయర్-1లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైనప్పటికీ, లీగ్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఆర్‌సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వన్‌డౌన్‌లో డేంజర్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎలాగూ ఉండనే ఉన్నారు. వీరితో కనీసం ఇద్దరు నిలబడినా కూడా గుజరాత్ భారీ స్కోరు సాధించడం ఖాయమే. ఫినిషర్‌గా రాహుల్ తెవాటియా ఒత్తిడిలోనూ మ్యాచ్‌లను ముగించగల సత్తా ఉన్నోడు.
గుజరాత్‌కు వరల్డ్-క్లాస్ బౌలింగ్ ఎటాక్ ఉండనే ఉంది. కగిసో రబాడ, జేసన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన పేస్ విభాగంతో పాటు, మిడిల్ ఓవర్లలో రషీద్ ఖాన్ మాయాజాలం గుజరాత్‌కు కొండంత అండ.
క్వాలిఫైయర్ 1 ను వన్‌సైడెడ్‌గా మ్యాచ్ గెలవడం ఆర్సీబీకి గుజరాత్‌పై డామినేషన్‌కు, కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ సమతూకంతో కనిపిస్తోంది. అలాగని గుజరాత్‌ను ఏమాత్రం తీసిపారేయలేం. మ్యాచ్ జరిగేది హోం గ్రౌండ్. గిల్, బట్లర్ క్లిక్ అయితే ఆర్సీబీకి చుక్కలే అన్న అంచనాలూ ఉన్నాయి.
పిచ్..
అహ్మదాబాద్ పిచ్‌పై రాత్రి వేళ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్ ఈజీ అవుతుంది.
