Top 5 Indian batters who have dominated New Zealand in T20Is
IND vs NZ : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం నరేంద్రమోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్లు 30 టీ20ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో భారత్ 18 సార్లు, కివీస్ 11 సార్లు విజేతలుగా నిలిచింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
గత కొన్నేళ్లుగా టీ20ల్లో కివీస్ పై విజయాలు సాధించడంలో భారత బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లోనూ మరోసారి బ్యాటర్లు తమ ప్రత్యేకను చాటాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు కివీస్ పై పరుగులు సాధించిన టాప్-5 ఆటగాళ్లు ఎవరో ఓ సారి చూద్దాం..
IND vs NZ : భారత్ వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..
సూర్యకుమార్ యాదవ్..
టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు న్యూజిలాండ్ పై అద్భుత రికార్డు ఉంది. భారత్ తరుపున కివీస్ పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు సూర్య కివీస్ పై 13 మ్యాచ్‌లు ఆడి 58.44 సగటుతో 526 పరుగులు సాధించాడు. ఆ జట్టుపై ఓ సెంచరీ, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి.
రోహిత్ శర్మ..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ కివీస్ పై 17 మ్యాచ్‌లు ఆడి 511 పరుగులు చేశాడు. ఇందులో ఆరు అర్థశతకాలు ఉన్నాయి.
కేఎల్ రాహుల్..
టీమ్ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు టీ20ల్లో న్యూజిలాండ్ పై మంచి రికార్డు ఉంది. అతడు 8 మ్యాచ్‌ల్లో 322 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి
ఇషాన్ కిషన్..
ఈ జాబితాలో ఇషాన్ కిషన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు న్యూజిలాండ్‌తో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. 28.90 సగటుతో 318 పరుగులు చేశాడు.
విరాట్ కోహ్లీ..
ఇక ఈ జాబితాలో మాజీ కెప్టెన్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. 10 మ్యాచ్‌ల్లో 34.55 సగటుతో 311 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.
పై ఐదుగురిలో ఇద్దరు.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లు ఆదివారం కివీస్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు.