రనౌట్‌తో మరోసారి భాగస్వామిని బలిగొన్న రాయుడు

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ జట్టు తటపటాయిస్తూనే చెప్పుకోదగ్గ స్కోరు చేసి కివీస్‌కు 253పరుగుల టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా టాపార్డర్ ఆరంభమైన కాసేపటికే 18/4గా మిగిలింది. నాల్గోవన్డేలో 92పరుగులు చేసిన భారత్.. ఈ సారి ఆ మాత్రం కూడా చేయలేదేమో అనిపించింది. కానీ, అంబటి రాయుడు క్రీజులో స్థిరపడి 90 పరుగులతో జట్టును పటిష్ఠంగా నిలిపాడు. మరో ఎండ్‍లో బ్యాటింగ్‌కు దిగిన విజయ్ శంకర్ చక్కటి భాగస్వామ్యం అందిస్తూనే 45 పరుగులు చేశాడు.
ఆ తర్వాత కీలక సమయంలో విజయ్ శంకర్ వికెట్ చేజార్చుకున్నాడు. సమన్వయ లోపం కారణంగా అయోమయ స్థితిలోకి వెళ్లిపోయిన విజయ్ శంకర్ (45) పిచ్ మధ్యలో నిలిచిపోయి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో నిలిచిన రాయుడు, శంకర్ జోడీ.. ఐదో వికెట్‌కి అభేద్యంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. జట్టు స్కోరు 116 వద్ద శంకర్ పేలవంగా రనౌటయ్యాడు.
ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసిన మున్రో బౌలింగ్‌లో బంతిని షార్ట్ మిడ్‌వికెట్ దిశగా తరలించిన విజయ్ శంకర్ క్రీజు వెలుపలికి వచ్చి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని రాయుడిని పరుగు కోసం పిలిచాడు. అయితే.. బంతి నేరుగా ఫీల్డర్ నీషమ్ చేతుల్లోకి వెళ్తుండటంతో పరుగుకి తొలుత రాయుడు నిరాకరించి ఆ తర్వాత అనూహ్యంగా పరుగు అందుకున్నాడు. కానీ, మరో ఎండ్‌లో ఉన్న శంకర్‌కు పరుగు తీయాలో.. వెనక్కి వెళ్లాలో అర్థంకాక పిచ్ మధ్యలోనే ఆగిపోయాడు. అప్పటికే బంతిని అందుకున్న నీషమ్.. బౌలర్ మున్రోకి బంతి అందించాడు. ఫలితంగా శంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు.