Spirit Of Cricket : నిజమైన క్రీడాస్ఫూర్తి.. జేజేలు కొడుతున్న నెటిజన్లు.. ఏం జరిగిందంటే..?
Spirit Of Cricket video : ఆట ఏదైనా కానివ్వండి ఇటీవల కాలంలో క్రీడాస్ఫూర్తి అనేది చర్చనీయాంశం అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- December 2, 2023 / 06:53 PM IST
Spirit Of Cricket
ఆట ఏదైనా కానివ్వండి ఇటీవల కాలంలో క్రీడాస్ఫూర్తి అనేది చర్చనీయాంశం అవుతోంది. మిగతా ఆటల సంగతి కాస్త పక్కన బెడితే మాత్రం క్రికెట్ లో మాత్రం క్రీడాస్ఫూర్తి అనేక సార్లు వివాదాస్పద మవుతోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన ఘటనను అభిమానులు ఎవ్వరూ అంత త్వరగా మరిచిపోరు. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా ప్రకటించడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబట్టారు. నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ చేసింది కరెక్టే అయినా కూడా అలా ఔట్ చేయడం మాత్రం సరికాదని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడ్డారు.
తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా అడిలైడ్ వేదికగా విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రెండో రోజు ఆటలో సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ తన వ్యక్తి గత స్కోరు 19 పరుగుల వద్ద ఉండగా డౌగ్ వారెన్ బౌలింగ్‌లో ఓ బంతిని షాట్ ఆడాడు. అయితే.. ఆ బంతి కీపర్ గ్లౌస్‌లను తాకుతూ ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ఆటగాడి చేతిలో పడింది.
ఫీల్డర్లు ఔట్‌కు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో బ్యాటర్ ప్రేజర్ షాక్‌కు గురైయ్యాడు. ఎందుకంటే బంతి అతడి బ్యాటును తాకలేదు. అయినప్పటికీ చేసేది లేక నిరాశగా పెవిలియన్ వైపు నడకసాగించాడు. అయితే.. రిప్లేలో బంతి బ్యాటును తాకక పోవడాన్ని గమనించిన విక్టోరియా కెప్టెన్ విల్ సథర్లాండ్ తన జట్టు సభ్యులతో కాసేపు చర్చించాడు. అనంతరం తమ ఔట్ అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు.
దీంతో ప్రేజర్ మళ్లీ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విక్టోరియా కెప్టెన్ విల్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజమైన క్రీడాస్ఫూర్తి అంటే ఇదేనంటూ పలువురు మాజీ క్రికెటర్లతో అభిమానులు కొనియాడుతున్నారు.
