Vinod Kambli : వినోద్ కాంబ్లీ హెల్త్ అప్డేట్.. దేవుడి దయ అంటూ వీడియో పోస్ట్..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు అయిన వినోద్ కాంబ్లీకి సంబంధించి ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
- Thota Vamshi Kumar
- Updated on- August 10, 2024 / 04:29 PM IST
Vinod Kambli Gives Health Update After Old Video Goes Viral
Vinod Kambli Health Update : టీమ్ఇండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ స్నేహితుడు అయిన వినోద్ కాంబ్లీకి సంబంధించి ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఈ క్రమంలో అతడు నడవడానికి కూడా ఎంతో కష్టపడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దాన్ని చూసిన అభిమానులు అంతా షాక్ కు గురైయ్యారు. 52 ఏళ్ల కాంబ్లీ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థించారు.
అయితే.. తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా అప్డేట్ ఇచ్చాడు కాంబ్లీ. థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు. ‘ఆ దేవుడి దయ వల్ల బాగున్నాను. ఎంతో ఫిట్‌గా ఉన్నాను. మైదానంలోకి వెళ్లి బ్యాటింగ్ చేసింత ఫిట్నెస్తో ఉన్నాను.’ అని అన్నాడు. ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
టీమ్ఇండియా తరుపున కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 1991లో షార్జాలో పాకిస్థాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 121 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన అతడు 3,561 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఓ వెలుగు వెగిలిన అతడు.. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక జట్టుకు దూరం అయ్యాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 10 వేలకు పైగా పరుగులు చేశాడు. మరోవైపు అతడి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించి ఎంతో ఎత్తుకు ఎదిగిన సంగతి తెలిసిందే.
