Vinod Kambli : ఆస్పత్రి నుంచి రాగానే వివాదంలో వినోద్ కాంబ్లీ.. కమ్ బ్యాక్ ఐస్ క్రీమ్ యాడ్ పై దుమారం..!
Vinod Kambli : మాజీ క్రికెట్ వినోద్ కాంబ్లీ నటించిన ఐస్ క్రీమ్ యాడ్ వివాదాన్ని రాజేసింది.
- Dharani Pilli
- Updated on- April 30, 2026 / 05:03 PM IST
Vinod Kambli ice cream ad created controversy and fans to tears
Vinod Kambli : మాజీ క్రికెట్ ప్లేయర్ వినోద్ కాంబ్లీ గత సంవత్సర కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు చావు అంచుల వరకు వెళ్లిన కాంబ్లీ అదృష్టవశాత్తు బతికి బట్టకట్టారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చిన ఆయన రాగానే వివాదంలో ఇరుక్కున్నారు. వినోద్ కాంబ్లీ చేసిన ఓ ఐస్‌క్రీమ్ యాడ్ పై పెద్ద దుమారం రేగుతోంది. ఈ యాడ్ లో కాంబ్లీ.. తన పాత క్రికెట్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి వివరించారు. “జీవితంలో తక్కువ పొందిన వారు, మరికొంచెం ఎక్కువ పొందడానికి అర్హులు” అనే నినాదంతో ఈ యాడ్ ని తెరకెక్కించారు.
దీన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వెంటనే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ యాడ్ పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కాంబ్లీ వంటి దిగ్గజ ఆటగాడి కష్టాలను, ఆయన వ్యక్తిగత బలహీనతలను ఒక వస్తువుగా అమ్ముకోవడానికి వాడుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఒక వ్యక్తి భావోద్వేగపూరితమైన కమ్‌బ్యాక్‌ను వ్యాపార కోణంలో చూడటం ఏమాత్రం సమంజసం కాదంటున్నారు.
ప్రస్తుత కాలంలో కొన్ని కంపెనీలు, బ్రాండ్లు తమ వస్తువులు, సేవలను ప్రచారం చేసుకోవడానికి సెలబ్రిటీల నిజ జీవిత కథలను వాడుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే కాంబ్లీ విషయంలో ఇది పరిధి దాటిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక మాజీ అంతర్జాతీయ క్రీడాకారుడిని ఇలాంటి ప్రకటనల్లో చూపించడం అంటే ఆయనను దారుణంగా అవమానించడమే అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అలాంటి సెలబ్రిటీకి గౌరవం ఇవ్వాల్సింది పోయి, ఐస్‌క్రీమ్ అమ్మడానికి వాడుకుంటారా?” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలువురు ప్రశ్నిస్తున్నారు.
భవిష్యత్తుపై ఆందోళన..
ప్రస్తుతం వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మెరుగుపడటంతో.. అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఇప్పుడాయన తన కెరీర్‌కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ వంటి భారీ వేదికలు ఉన్న తరుణంలో, ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌కి తగిన గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత క్రికెట్ బోర్డుపై కూడా ఉందని కొందరు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, ఈ ఐస్‌క్రీమ్ ప్రకటన మాత్రం ప్రస్తుతం భారత క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
