Virat Kohli : నా కల నెరవేరింది.. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. ఆ సిక్స్ కొట్టినప్పుడు.. కోహ్లీ కామెంట్స్..
ఇలాంటి క్షణం గురించి నేను ఎన్నో సార్లు ఆలోచించాను. మనం ఎప్పుడో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఆ మ్యాచ్‌లో నేను విన్నింగ్స్ రన్స్ కొట్టాలని అనుకున్నాను. ఈ రోజు అది సాధ్యమైంది అని కోహ్లీ (Virat Kohli ) అన్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 1, 2026 / 08:02 AM IST
Virat Kohli comments after player of the match recevied in IPL 2026 Final (pic credit@ipl)
- వరుసగా రెండో సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ
- ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ
- విన్నింగ్స్ రన్స్
- కల నిజమైందంటూ కామెంట్స్
Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండో సారి కప్పును ముద్దాడింది. ఆదివారం నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఇది తాను కలలు కనే విషయం అని, తాను విన్నింగ్ రన్స్ తీసినప్పుడు జట్టు ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడాలని అనుకున్నానని, అది ఈ రోజు నెరవేరిందని విరాట్ కోహ్లీ అన్నాడు.
వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ మూడు వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ లు తలా వికెట్ తీశారు.
ఇక ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ అవార్డు అందుకున్న తరువాత కోహ్లీ మాట్లాడుతూ.. వరుసగా రెండో సారి ఐపీఎల్ విజేతలుగా నిలవడంతో ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఇది మనం కలలు కనే విషయం అని చెప్పుకొచ్చాడు. ‘ఇలాంటి క్షణం గురించి నేను ఎన్నో సార్లు ఆలోచించాను. మనం ఎప్పుడో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు, ఆ మ్యాచ్‌లో నేను విన్నింగ్స్ రన్స్ కొట్టాలని అనుకున్నాను. ఈ రోజు అది సాధ్యమైంది.’ అని కోహ్లీ అన్నాడు.
తాము ఎలాంటి ఒత్తిడితో మైదానంలో అడుగుపెట్టలేదని, ఎంతో రిలాక్స్‌గా మ్యాచ్‌కు వచ్చామన్నాడు. మా జట్టుపై మాకు ఎంతో నమ్మకం ఉంది. మా ఆట మేము ఆడాలని అనుకున్నాము. జట్టు పై నమ్మకం ఉంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఛేజింగ్ విషయానికి ఏమీ చేయాలో నాకు బాగా తెలుసు. తొలుత బ్యాటింగ్ చేసేటప్పటికి కంటే నేను ఛేజింగ్‌లోనే చాలా సౌకర్యవంతంగా భావిస్తాను. అని కోహ్లీ అన్నాడు.
తన ఐపీఎల్ కెరీర్‌లోనే వేగంవంతమైన హాఫ్ సెంచరీని సాధించడంపై మాట్లాడుతూ.. ఈ రోజుల్లో టీ20లు ఎంతగానో మారిపోయాయి. యువ ఆటగాళ్లు మిమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ, మీ ఆటను మార్చుకోమని, స్థాయిని పెంచమని అడుగుతూ ఉంటారు. ఇది ఒక ఉత్తేజకరమైన పరిస్థితి. ఎందుకంటే ఇది మిమ్మల్ని మెరుగుపరచుకోవడానికి, సాధించడానికి ఓ లక్ష్యాన్ని ఇస్తుంది. ఇక నేను మెరుగవ్వడంలోనూ, మెరుగుపడగల రంగాలను గుర్తించడంలోనూ చాలా గర్వపడతాను.
భారీ షాట్లు కొట్టేందుకు నేను నా ఆటను అంతగా మార్చుకోలేదు, నా ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
మా ఫ్లాన్ ఒక్కటే..
ఛాంపియన్లుగా ఈ ఏడాది టోర్నీలో అడుగుపెట్టాము. ముందు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండడమే మా తొలి లక్ష్యం. దాన్ని సాధించాం. ఆ తర్వాత చాలా మంది మమ్మల్ని అడిగారు.. ఫైనల్స్‌లో మీరు ఎవరిని ఇష్టపడతారు అని. దానికి మేము, అది మాకు ముఖ్యం కాదు అని చెప్పాం. మా ముందు ఏ జెర్సీ ఉందో మేము పట్టించుకోము. మేము అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాం. మేము ఇతర జట్లపై కాకుండా మా జట్టుపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాం. మేము ఇతర జట్లను గౌరవిస్తాము. మేము ఏ ఇతర జట్టును రెచ్చగొట్టము. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం కొనసాగించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా జట్టులో చాలా పరిణతి చెందిన ఆటగాళ్లు, చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. ఆ అనుభవం ఎల్లప్పుడూ క్లిష్ట పరిస్థితులలో రాణించేలా చేస్తుంది.
ఈ రోజు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగాము. వారు నన్ను త్వరగా ఔట్ చేయాలని చూస్తారని నాకు తెలుసు. కానీ ఒకవేళ నేను త్వరగా ఔట్ అయినా.. మాది ఒక ఛాంపియన్ జట్టు అని, ఇంకా మూడు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే గెలిపిస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. ఇలా ఉంటే.. మీరు ఖచ్చితంగా బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగలరు. దీనికి కారణం యాజమాన్యమేనని నేను అనుకుంటున్నాను. వాళ్ళు జట్టును ఎంపిక చేసిన విధానం, ఆటగాళ్ల ప్రతిభ, ఆటగాళ్లు పై చూపించిన నమ్మకమే కారణం. మేము వరుసగా రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాము. ఇది ఒక ప్రత్యేకమైన ఘనత. గత సంవత్సరం మేము గెలిచినప్పుడు మో బోబాట్ చెప్పింది కూడా ఇదే.. ఇది అంతం కాదు. మేము వరుసగా రెండోసారి గెలవాలని చూస్తాము. మేము చివరికి సాధించింది కూడా అదే. కాబట్టి ఒక జట్టుగా మేం చాలా గర్వపడుతున్నాం. అని కోహ్లీ చెప్పాడు.
ఓపెనింగ్ భాగస్వామ్యం గురించి..
డ్రెస్సింగ్ రూమ్‌లో వెంకీతో మామూలుగా మాట్లాడాను. నేను అతనికి ఒక్కటే చెప్పాను.. మనం పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను ముగించాలి అని. దానికి అతను, సరే, అలాగే చేద్దాం అన్నాడు. కాబట్టి మా మధ్య పూర్తి స్పష్టత ఉంది. మేమిద్దరం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏ దశలోనూ ఎలాంటి సందేహం లేదు. మేము కేవలం పరుగులు చేయాలనుకున్నాం. బౌలర్లపై విరుచుకుపడాలనుకున్నాం, ఎందుకంటే ఇలాంటి ఫైనల్ మ్యాచ్‌ల్లో.. ఓ రెండు వికెట్లు కోల్పోతే.. పరిస్థితులు క్లిష్టంగా మారతాయని మాకు తెలుసు. అందుకే రన్ రేట్‌ను ఎప్పుడూ ఏడున్నర, ఎనిమిదికి పెరగనివ్వలేదు. వెంకటేష్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను క్రీజులోకి వచ్చి ఓపెనర్‌గా అద్భుతంగా ఆడాడు. గత మూడు నాలుగు మ్యాచ్‌లలో అతని పట్టుదలే మాకు విజయాన్ని అందించింది.
అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ..
నేను ఎప్పుడూ చెప్తుంటాను, మాకు ఏడు హోమ్ మ్యాచ్‌లు లేవు. బహుశా 14 మ్యాచ్‌లు ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా, అభిమానులు జట్టును ఉత్సాహపరుస్తూ, మాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ రోజు గుజరాత్ హోమ్ గ్రౌండ్ కావచ్చు. కానీ మీరు చూస్తే 90 మంది అభిమానులు ఆర్‌సీబీ ఫ్యాన్సే. ఇన్నేళ్లుగా మేము సంపాదించుకుంది ఇదే. మేము వారిని గర్వపడేలా చేస్తూనే ఉంటాము. మా వంతు అత్యుత్తమ ప్రయత్నం చేస్తాం. వారి మద్దతు వెలకట్టలేనిది. మాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది.
