Virendra Sehwag
Virendra Sehwag: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన సోదరుడు వినోద్ సెహ్వాగ్ ను చంఢీగడ్ లోని మణిమజ్రా పోలీసులు అరెస్టు చేశారు. రూ.7కోట్ల చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు వినోద్ సెహ్వాగ్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. అక్కడి నుంచి అతన్ని జ్యుడీషియల్ కస్టడీలో జైలుకు తరలించారు.
వినోద్ సెహ్వాగ్ న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ, ఇంకా బెయిల్ మంజూరు కాలేదు. వినోద్ బెయిల్ పిటీషన్ పై మార్చి 10న తీర్పు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అతను పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. ఇదిలాఉంటే.. వీరేంద్ర సెహ్వాగ్ కు మొత్తం నలుగురు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉన్నారు. అందరికంటే వినోద్ చిన్నవాడు.
సెహ్వాగ్ భారత జట్టు తరపున 251 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 8273 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 15 సెంచరీలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్ లో 96 వికెట్లు పడగొట్టాడు. సెహ్వాగ్ 104 టెస్టుల్లో 8586 పరుగులు చేశాడు. అందులో ఆరు డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 40 వికెట్లు పడగొట్టాడు.