ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను పూసర్ల వెంకట సింధు ఆగష్టు 27న సాధించింది. అంతకుముందు రోజే మరో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను గెలిచి స్వర్ణాన్ని దక్కించుకుంది. సింధుకు వచ్చినంతటి గౌరవం, ప్రోత్సాహకాలే కాదు.. కనీసం ప్రశంసలకు కూడా నోచుకోని ప్లేయర్ పేరు మానసి జోషి. ముంబైకు చెందిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ మానసి జోషి శనివారమే బంగారు పతకాన్ని గెలుచుకుంది.
పారా బ్యాడ్మింటన్ విభాగంలో ఈ ఘనతను సాధించింది. కాలు కోల్పోయినా కృత్రిమ కాలుతోనే, మొక్కవోని పట్టుదలతో శ్రమించింది. ఏ లోపం లేకుండా టోర్నీలో గెలవడం కష్టంగా మారిన ప్లేయర్ల కంటే మానసి చేదు సంఘటనలు అధిగమించి ఈ స్థాయికి ఎదిగింది. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోషి.. ఎముకలు విరిగిపోయాయి. ఎడమకాలు తెగి పడిపోయింది. ప్రమాదం జరిగిన మూడు గంటల వరకూ ఆమెకు చికిత్స అందలేదు.
ఎట్టకేలకు హాస్పిటల్లో చేర్పిస్తే.. 10 గంటలు ఆపరేషన్ చేసి చివరికి ప్రాణాలను కాపాడగలిగారు. కాలును జాయింట్ చేసినా మరో ఆటంకం ఎదురైంది. గ్యాంగ్లిన్ అనే వ్యాధి సోకడంతో కాలు పాడవడం మొదలైంది. దీంతో కాలును తొలగించారు. నాలుగు గోడల మధ్య కొన్ని నెలల పాటు కాలం గడిపిన మానసి చరిత్ర సృష్టించాలనుకుంది.
ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడిచి పట్టుదలతో బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగింది. స్కోబా డైవింగ్‌లో మెలకువలు నేర్చుకుని 2014లో పారా ఏషియన్ గేమ్స్‌తో అంతర్జాతీయ క్రీడల్లో పోటీ చేసింది. అదే ఆత్మవిశ్వాసంతో పారా బ్యాడ్మింటన్ గోల్డ్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణాన్ని సాధించింది.