Dunith Wellalage
Spinner Dunith Wellalage : స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లు సిద్ధహస్తులు అన్న సంగతి తెలిసిందే. హేమాహేమీ స్పిన్నర్ల బౌలింగ్ లో సైతం అలవోకగా పరుగులు సాధిస్తుంటారు. అయితే.. ఓ యువ స్పిన్నర్ భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం అతడి బౌలింగ్ ను అంచనా వేయడంలో విఫలమై అతడికే వికెట్లు సమర్పించుకున్నారు. అతడు మరెవరో కాదు శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే (Dunith Wellalage).
ఆసియాకప్ 2023 (Asia Cup 2023) టోర్నీ సూపర్-4 దశలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో స్పిన్నర్ దునిత్ వెల్లలాగే దెబ్బకు టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ధాటికి ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మొత్తంగా తన 10 ఓవర్ల కోటాలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ ఉండడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. రోహిత్ శర్మ దూకుడుగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 11 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 80 పరుగులతో టీమ్ఇండియా పటిష్టంగా ఉంది. అయితే.. అప్పుడొచ్చాడు వెల్లలాగే. తన మొదటి బంతికే శుభ్ మన్ గిల్ (19) ను ఔట్ చేశాడు. ఆ తరువాత తన వరుస ఓవర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం ఔట్ చేసి గట్టి దెబ్బకొట్టాడు. తన మొదటి 3 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడంటే అతడు బ్యాటర్లను ఎంతంగా ఇబ్బంది పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
IND vs SL : చరిత్ర సృష్టించిన రోహిత్-గిల్ జోడీ..
ఆ తరువాత కూడా తన జోరును కొనసాగిస్తూ.. క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్ (39) తో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య (5)ను కూడా పెవిలియన్ చేర్చాడు. మొత్తంగా ఐదు వికెట్లు తీసి శ్రీలంక తరుపున ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా(20 ఏళ్ల 246 రోజులు) రికార్డులకు ఎక్కాడు.
దునిత్ వెల్లలాగే ఎవరంటే..?
కొలంబో లో జనవరి 9, 2003న జన్మించాడు దునిత్ వెల్లలాగే. అండర్19 ప్రపంచకప్ లో సత్తా చాటడంతో అతడు వెలుగులోకి వచ్చాడు. స్కాట్లాండ్, ఆస్ట్రేలియాలపై ఐదేసి చొప్పున వికెట్లు తీయడంతో పాటు ఆ టోర్నీలో శ్రీలంక తరుపున అత్యధిక వికెట్లు(17) తీసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతేనా బ్యాటింగ్ లో 44 సగటుతో 264 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు అతడిని 2023 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌కి స్టాండ్ బై ప్లేయర్ గా చోటు కల్పించింది. శ్రీలంక స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగ గాయంతో ఆసియా కప్ 2023 కు దూరం కావడంతో అతడి స్థానంలో దునిత్ వెల్లలాగే ఆడుతున్నాడు. తన మార్క్ బౌలింగ్ తో అదరగొడుతూ ఫ్యూచర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు.
Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత..
పాకిస్తాన్ పై 2022లో టెస్టుల్లో, ఆస్ట్రేలియాతో మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటిదాకా 8 వన్డేలు మాత్రమే ఆడిన దునిత్ వెల్లలాగే 9 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 22 మ్యాచుల్లో 71 వికెట్లు, 20 లిస్టు ఏ మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు.