పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిది అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం ట్రినిడాడ్‌లో జరిగిన తొలి వన్డేలో నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అరంగ్రేటం నుంచి తొలి 65 వన్డే మ్యాచ్‌ల తరువాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అఫ్గానిస్థాన్ ఆటగాడు రషీద్ ఖాన్ పేరిట ఉంది. రషీద్ తొలి 65 వన్డే మ్యాచ్‌ల్లో 128 వికెట్లు తీయగా.. షాహీన్ 131 వికెట్లు పడగొట్టాడు.
ఇక తొలి వన్డే మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో ఎవిన్ లూయిస్ (60; 62 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ షై హోప్ (55; 77 బంతుల్లో 4 ఫోర్లు), రోస్టన్ ఛేజ్ (53; 54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లు తీశాడు. నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు. సైమ్ అయూబ్, సుఫియాన్ ముఖీమ్, సల్మాన్ అఘా లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 281 పరుగుల లక్ష్యాన్ని పాక్ 48.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్ (63 నాటౌట్; 54 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (53; 69 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. బాబర్ ఆజాం (47; 64 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), హుస్సేన్ (41 నాటౌట్; 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. విండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు. జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ, రోస్టన్ చేజ్ లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
ఈ విజయంతో పాకిస్తాన్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే కూడా ఇదే వేదిక పై ఆదివారం (ఆగస్టు 10న) జరగనుంది.