Sikandar Raza : భారత్‌తో మ్యాచ్.. అరుదైన ఘనత పై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా కన్ను..
భారత్‌తో మ్యాచ్‌కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాను (Sikandar Raza) అరుదైన ఘనత ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- February 26, 2026 / 12:36 PM IST
Zimbabwe captain Sikandar Raza 15 runs away to create History
- గురువారం భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్
- అరుదైన ఘనతపై సికిందర్ రజా కన్ను
- 15 పరుగులు చేస్తే ఏకైక జింబాబ్వే ఆటగాడిగా
Sikandar Raza : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా గురువారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదిక కానుంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఎంతో కీలకం.
ఈ కీలక మ్యాచ్‌కు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాను ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. భారత్‌తో మ్యాచ్‌లో సికిందర్ రజా 15 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన తొలి జింబాబ్వే క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
2013లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సికిందర్ రజా అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 131 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 126 ఇన్నింగ్స్‌ల్లో 26.2 సగటుతో 2985 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 16 అర్థశతకాలు ఉన్నాయి.
ఇక ఓవరాల్‌గా 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న 14వ బ్యాటర్‌గా రజా నిలవనున్నాడు. అతడి కంటే ముందు బాబర్ అజామ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, పాల్ స్టిర్లింగ్, మార్టిన్ గుప్టిల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, వీరన్‌దీప్ సింగ్, ఆరోన్ ఫించ్, క్వింటన్ డికాక్ లు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 3 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నారు.
