AI Impact Summit 2026 ( Image Credit : Google Gemini AI )
AI Impact Summit 2026 : అంతా ఏఐ ఆధిపత్యమే.. అన్ని రంగాల్లోకి ఏఐ పాతుకుపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతి కంపెనీ మనుషుల కన్నా ఏఐకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఐటీ ఉద్యోగుల్లో ఏఐ రాకతో జాబ్స్ ఎప్పుడు ఊడతాయోనన్న ఆందోళన మొదలైంది.
ఏఐతో తక్కువ పెట్టుబడి ఎక్కువ పని క్షణాల్లో పూర్తి అయిపోతుంది. ఒక మనిషి చేయాల్సిన పనిని ఏఐ ఇప్పుడు రోబో టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలో చేసేస్తున్నాయి. దాంతో టెక్ ఉద్యోగుల్లో తమ ఉద్యోగాలపై భయాందోళన మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కంగారు పడిపోతున్నారు.
ఈ ఏఐపై ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ టెక్ పరిశ్రమ నేతలు టెక్ ఉద్యోగులు అసలు భయపడాల్సిన అవసరం లేదని బల్లగుద్ది మరి చెబుతున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో టెక్ ఇండస్ట్రీ నేతలు, దిగ్గజ సీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్ నిపుణులు టెక్ ఉద్యోగుల్లో ఏఐ భయాందోళనలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఏఐ యుగంలో నిరంతర అభ్యాసం తప్పనిసరి :
ముఖ్యంగా ఉద్యోగులు, యువకులు చేయాల్సిందల్లా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కాలక్రమేణా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఏఐ యుగంలో అతి ముఖ్యమైన విషయం నిరంతర అభ్యాసమేనని నిపుణులు పేర్కొన్నారు. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో ఏఐ మరింత అభివృద్ధి చెందుతుందని, పని చేసే పద్ధతులను మారుస్తుందని, కంపెనీలలో ఉద్యోగుల రోల్స్ కూడా భారీ మార్పులకు దారితీస్తుందని అంటున్నారు.
“ఏఐ యుగంలో ఉపాధి కల్పన భవిష్యత్తు” అనే సెషన్ సందర్భంగా జరిగిన సమావేశంలో రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో మనం పనిచేసే విధానాన్ని ఏఐ గణనీయంగా మారుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని పాత ఉద్యోగాలు మాయమైపోయినప్పటికీ కూడా ఏఐ అనేక కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడమే. కొత్త టెక్నాలజీని మారుతున్న అవసరాలకు అనుగుణంగా తమ స్కిల్స్ కాలానుగుణంగా అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడే మీరు కెరీర్ గ్రోత్ కొనసాగుతుందని చెప్పారు.
ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు, నౌక్రీ.కామ్ యజమాని సంజీవ్ బిఖ్‌చందాని మాట్లాడుతూ.. బ్యాంకుల్లో కంప్యూటర్లు వచ్చినట్టుగానే ఐటీ కంపెనీలో ఏఐ ప్రభావం ఉంటుందని అన్నారు. ఆ సమయంలో యువత చాలా ఉద్యోగాలు కోల్పోతామని భయపడ్డారు. కానీ, అది జరగలేదు. ఇంకా పని వేగం పెరిగింది. ఉత్పాదకత కూడా అదే స్థాయిలో పెరిగింది. విధానాలు, మార్పుల గురించి ఆందోళన చెందడం కన్నా తమను తాము మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టాలని ఆయన యువతకు సూచించారు.
యువత ఏఐ టూల్స్ తప్పక నేర్చుకోవాలన్నారు. తద్వారా ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు సాయపడుతుందని ఆయన అన్నారు. రాబోయే 3 నెలల్లో కనీసం 3 AI ప్లాట్‌ఫామ్‌లను వాడటం నేర్చుకోవాలని సూచించారు. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఏఐ నేర్చుకోని వారు మాత్రం వెనుకబడిపోతారని బిఖ్‌చందాని అన్నారు. అయితే, ఏఐ నేర్చుకునే వారికి మరింత సురక్షితమైన మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఏఐతో జాబ్స్ పోవు.. వర్క్ పాలసీ మారుతుంది :
ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ఎడ్జ్‌వెర్వ్ సీఈఓ సతీష్ సీతారామయ్య మాట్లాడుతూ.. టెక్ కంపెనీలు తమ వర్క్ లోడ్ ఫాస్ట్ అయ్యేందుకు ఏఐ అద్భుతంగా సాయపడుతుందని అన్నారు. అయితే, ఏఐతో వర్క్ చాలా ఈజీ అవుతుంది. మరింత ప్రొడక్షన్ ఇస్తుంది.
అయితే, ఏ పనికైనా ఏఐ చేసింది చివరికి మనుషులే పూర్తి చేయాలి. ఏఐ ఉద్యోగాలను పూర్తిగా తొలగించదు కానీ పని చేసే విధానాన్ని మారుస్తుందని ఆయన చెప్పారు. అందుకే ఏఐ యుగంలో నేర్చుకోవడం కీలకమని, అందుకే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం అత్యంత ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.
సంపర్క్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ వినీత్ నాయర్ మాట్లాడుతూ.. ఏఐ ఇప్పటికే ఉన్న కొన్ని జాబ్స్ లాగేసుకుందన్నారు. దాదాపు 50 శాతం ఉద్యోగాలపై ప్రభావం పడిందని ఆయన అంచనా వేశారు. అయితే, ఏఐ కూడా అంతే సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు.
ఏఐ ప్రజలు తమ స్కిల్స్ నేర్చుకోవడానికి, అప్ గ్రేడ్ చేసుకోవడానికి అవకాశాలను అందిస్తుందని ఆయన అన్నారు. అందుకే ఏదైనా రంగంలో ఉన్నా ఏ కొత్త స్కిల్స్ అవసరమో అర్థం చేసుకోవాలని, తదనుగుణంగా తమను తాము రెడీ చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు.
ఐటీ ఉద్యోగులకు అతిపెద్ద సందేశం ఏంటి? :
ఏఐ యుగంలో ఉద్యోగాలు వృద్ధికి భద్రతకు ఉద్యోగులు కొత్త టెక్నాలజీ వైపు మళ్లాలని టెక్ ఇండస్ట్రీ నేతలు అంటున్నారు. ఏఐ టూల్స్ ఇప్పటినుంచే వాడటం నేర్చుకోవాలి. కాలక్రమేణా నిరంతరం కొత్త స్కిల్స్ పొందాలి.
మారుతున్న ఉద్యోగ అవసరాలకు తగినట్టుగా ఉద్యోగులు కూడా తమను తాము అప్‌డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా, ఏఐని ముప్పుగా చూడొద్దు. అదో కొత్త అవకాశంగా మాత్రమే చూడాలి. ఏఐ నేర్చుకుని దాన్ని అమలుచేసే వారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయి.