Elon Musk X Money : ఎక్స్‌లో సరికొత్త ఫీచర్.. మీకు పోస్టు నచ్చిందా?.. లైక్ బటన్‌తోనే డబ్బులు పంపొచ్చు.. ఎలాగంటే?

Elon Musk X Money : ఎలన్ మస్క్ ఎక్స్‌లో కొత్త మనీ ఫీచర్‌ రాబోతుంది. లైక్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి క్రియేటర్లకు ఒక డాలర్ పంపుకోవచ్చు.. ఎక్స్ మనీ సేవలు, భారత్‌లో ప్రారంభంపై పూర్తి వివరాలివే..

Elon Musk X Money

  • ఒక్క లాంగ్ ప్రెస్‌తో డాలర్ గిఫ్ట్.. ఎలాన్ మస్క్ కొత్త ప్లాన్
  • పోస్టు నచ్చిందా? లైక్ బటన్‌తోనే డబ్బులు పంపే ఫీచర్
  • సోషల్ మీడియా నుంచి డిజిటల్ పేమెంట్స్ వరకు..

Elon Musk X Money : సోషల్ మీడియాలో మనకు నచ్చిన పోస్టుకు లైక్ కొడతాం.. క్రియేటర్ల కంటెంట్ నచ్చితే కామెంట్ చేస్తాం. కానీ, అదే లైక్ బటన్‌తో డబ్బులు కూడా పంపగలిగితే? ఈ ఆలోచనను నిజం చేసే దిశగా ఎలాన్ మస్క్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎక్స్ (X) వేదికగా కంటెంట్ క్రియేటర్లకు సులభంగా డబ్బులు పంపేలా ఓ కొత్త ఫీచర్‌ను ఆయన ప్రకటించారు. అదేంటి? ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

లైక్ బటన్‌తోనే మనీ ట్రాన్స్‌ఫర్ :
ఎలాన్ మస్క్ ప్రతిపాదన ప్రకారం.. ఎక్స్‌లోని లైక్ బటన్‌ను కొద్దిసేపు ట్యాప్ చేయడం (Long Press) ద్వారా సంబంధిత పోస్టు చేసిన వ్యక్తికి ఒక డాలర్ పంపే అవకాశం ఉంటుంది. అంటే, ఒక క్రియేటర్ వీడియో, ఫొటో లేదా పోస్టు మీకు నచ్చితే.. ప్రత్యేకంగా మరో పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.

వారికి చిన్న మొత్తంలో డబ్బులు పంపవచ్చన్నమాట.. ప్రస్తుతం ఇది ప్రతిపాదిత ఫీచర్ మాత్రమే. ఈ సదుపాయం ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది? ఎవరెవరు ఉపయోగించవచ్చు? అనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

‘ఎవ్రీథింగ్ యాప్’ దిశగా మస్క్ అడుగులు :
ఎక్స్‌ను కేవలం పోస్టులు పెట్టుకునే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా కాకుండా మెసేజింగ్, డిజిటల్ పేమెంట్లు, ఆర్థిక సేవలు ఒకే చోట లభించే ‘ఎవ్రీథింగ్ యాప్‌’గా మార్చాలన్నది మస్క్ లక్ష్యం. ఈ క్రమంలో ఎక్స్ మనీ (X Money) సేవలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read Also : Cyclone Arnab Alert : ఏపీ తీరానికి తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం, ప్రజలకు చంద్రబాబు కీలక సూచనలు!

అమెరికాలో ఎక్స్ మనీ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో వ్యక్తుల మధ్య నగదు బదిలీలు, ఎక్స్ వీసా డెబిట్ కార్డు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, అన్ని ఫీచర్లు ప్రతి వినియోగదారుడికి అందుబాటులో ఉంటాయని చెప్పలేం..

భారత్‌కు ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుంది? :
క్రియేటర్లకు తమ కంటెంట్ ద్వారా ఆదాయం సంపాదించేందుకు ఫాలోవర్లకు నేరుగా సపోర్టు అందించే అవకాశం ఉంటుంది. చిన్న మొత్తాల చెల్లింపులను మరింత ఈజీ చేయడమే ఫీచర్ ఉద్దేశంగా చెప్పొచ్చు.

అయితే, భారత్‌లో ఎక్స్ మనీ సేవలు లేదా లైక్ బటన్ ద్వారా పేమెంట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అధికారిక ప్రకటన లేదు. ఈ ఫీచర్ ప్రవేశపెడితే సోషల్ మీడియాలో లైక్ బటన్ ద్వారా డిజిటల్ పేమెంట్లు చేయొచ్చు అనమాట..