చేతి రాతను నేరుగా కంప్యూటర్‌లోకి కాపీ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

  • Publish Date - May 8, 2020 / 04:52 AM IST

ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు విస్తృత సేవలు అందించే గూగుల్ సంస్థ.. తన మల్టిపుల్ టూల్ గూగుల్ లెన్స్‌కు మరో ఉపయోగకరమైన టూల్ జోడించింది. ఇకపై ఫోన్ నుంచి చేతితో రాసిన నోట్‌లను లెన్స్‌ ద్వారా కంప్యూటర్‌కు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది.

అయితే అందుకు రాసేవారి చేతివ్రాత చక్కగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ టూల్ పనిచేస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఉపయోగించడానికి, మీరు గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌తో పాటు ఆండ్రాయిడ్‌లో ఇండిపెండెంట్ గూగుల్ లెన్స్ కలిగి ఉండాలి. (లెన్స్‌ను సెర్చ్ బార్ పక్కన ఉన్న బటన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు). 

ఇందుకోసం మీరు రెండు పరికరాల్లో ఒకే Google అకౌంట్‌కు లాగిన్ అవ్వాలి. కెమెరాతో చేతితో రాసిన రాతను ఫోటో తీసుకుని Google డాక్స్‌లో ఏదైనా పేపర్‌లోకి వెళ్లి రాసిన దానిని గూగుల్ లెన్స్ ద్వారా టెక్స్ట్ కాపీ చేసినట్లయితే.. కిందనున్న ‘copy to computer’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ఏ క్రోమ్ బ్రౌజర్‌లో అయితే లాగిన్ అయ్యారో అందులో దీన్ని పేస్ట్ చేసుకోవచ్చు.

అయితే దానికి మీ చేతి రాత కాస్త అర్థమయ్యే విధంగా ఉండాలి. దీంతో మీకు మళ్లీ టైప్ చేసుకునే శ్రమ తప్పుతుంది. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగులో స్పష్టంగా వెల్లడించింది. ఈ కాపీ-పేస్ట్ ఫీచర్ సరిగ్గా పనిచేయాలంటే వినియోగదారులు గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ బ్రౌజర్‌ను ఉపయోగించాలి.

అయితే ఎంత పనిచేసినా కూడా.. నూరు శాతం తప్పులు లేకుండా కాపీ అయ్యే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. కాపీ అయ్యాక తప్పులు ఏమైనా వచ్చాయేమో అని కచ్చితంగా ఒకసారి చూసుకోవలసిన అవసరం  మాత్రం ఉంది. 

Also Read | Zoomకు పోటీగా : జీమెయిల్‌లో Google Meet వీడియో కాలింగ్