పొగ మంచులో కూడా రైళ్లకు గ్రీన్ సిగ్నల్

  • Publish Date - December 14, 2019 / 05:38 AM IST

పొగ మంచు కారణంగా బస్సులు, విమానాలే కాదు.. రైలు నడిపే వారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ప్రత్యేకించి రైలు పట్టాల ఎదురుగా ఏముందో కనిపించకపోడంతో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి దక్షిణ మధ్య  రైల్వేలో కొత్తగా  ఫాగ్ పాస్ మెషిన్ ను ప్రారంభించారు. ముందుగా సికింద్రబాద్, విజయవాడ రైల్వే డివిజన్ల్లో  వాడుతున్నారు.

దక్షిణ మధ్య రైల్వే 250 ఫాగ్ పాస్ మెషిన్ లను సికింద్రాబాద్, విజయవాడ డివిజన్ల పరిధిలో ఉపయోగిస్తున్నారు. ఫాగ్ పాస్ మెషిన్ లను వెంట తీసుకు వెళ్లటంతో లోకో పైలెట్లకు పొగ మంచు వాతావరణంలో చక్కగా ఉపయోగపడుతాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజనన్ మాల్యా నమ్మకంగా చెబుతున్నారు.  త్వరలో మిగిలిన  డివిజన్ ల్లలో కూడా ఫాగ్ పాస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని శుక్రవారం (డిసెంబర్ 14, 2019)న ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ఫాగ్ పాస్ మెషిన్లు GPS ఆధారంగా పని చేస్తాయి. ముందుగా వచ్చే స్టేషన్ లు, లెవెల్ క్రాసింగ్ గేట్లు, మలుపులు స్పష్టంగా ఈ పరికరంలో కనిపిస్తాయి. దీనిలో ఆడియో, వీడియో సౌకర్యముంది. రైలు ప్రయాణంలో ముందుగా రాబోయే 3 లొకేషన్లకు సంబంధించిన విజువల్స్ ను చూడవచ్చు. రైలు వేగాన్ని తగ్గించాల్సిన అసవరం లేదు. ఎదురుగా  500 మీటర్ల దూరంలో ఎవరున్నా,  జంతువైనా సరే, ముందుగా గుర్తించి డ్రైవర్లను అలర్ట్ చేస్తుంది.