IRCTC Down : ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ బుకింగ్ సర్వీసులు మళ్లీ అందుబాటులోకి.. ఓసారి చెక్ చేసుకోండి!

IRCTC Down : భారతీయ రైల్వే ఇ-టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ ఇప్పుడు పనిచేస్తోంది. సాంకేతిక లోపం కారణంగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 2 గంటలకు పైగా పని చేయలేదు. సమస్యను పరిష్కరించిన టికెట్ బుకింగ్ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి.

IRCTC Down _ E-ticket booking services resume after 2 hours of technical glitch

IRCTC Down : ప్రముఖ భారతీయ రైల్వే ఇ-టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీ (IRCTC) సర్వీసులు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక లోపం కారణంగా దాదాపు 2 గంటల కన్నా ఎక్కువ సమయం సర్వీసులు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యను పరిష్కరించిన అనంతరం ఎప్పటిలానే ఐఆర్‌సీటీసీ సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇ-టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ (https://www.irctc.co.in/) బాగానే పని చేస్తోందని ఐఆర్‌సీటీసీ అధికారిక ట్విట్టర్ (X) ప్లాట్‌ఫారమ్‌లో వెల్లడించింది.

ఈరోజు (గురువారం) మధ్యాహ్నం సమయంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సాంకేతిక కారణాల వల్ల ఇ-టికెట్ బుకింగ్ తాత్కాలికంగా ప్రభావితమైంది. అప్పటినుంచి సాంకేతిక బృందం పనిచేస్తోందని, బుకింగ్ సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

2 గంటల తర్వాత బుకింగ్ సర్వీసులు పున:ప్రారంభం : 
అయితే, మధ్యాహ్నం 1:55 గంటల తర్వాత నుంచి వెబ్‌సైట్ బాగానే పనిచేస్తోందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ-టికెట్ బుకింగ్ 13:55 గంటలకు పునఃప్రారంభమైందని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ ద్వారా తెలియజేసింది. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ స్టాక్ గురువారం మధ్యాహ్నం 2:25 గంటలకు 0.41శాతం పెరిగి రూ. 702.20 వద్ద ఉంది.

Read Also : IRCTC Mobile App : ఐఆర్‌సీటీసీ యాప్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే?

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సహా మొబైల్ అప్లికేషన్లలో కూడా బుకింగ్ సేవలు నిలిచిపోవడంతో పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సైట్ రాత్రి 11:30 నుంచి 12:30 గంటల వరకు డౌన్ అయి ఉంది. రోజువారీ మెయింట్‌నెన్స్ తర్వాత ఐఆర్‌సీటీసీ సైట్ డౌన్ కావడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. వెబ్‌సైట్ డౌన్ కావడంపై అనేక మంది వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. రైలు టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఎర్రర్ మెసేజ్ కనిపించింది. టికెట్లను బుకింగ్ చేసుకోలేకపోతున్నామంటూ యూజర్లు మండిపడ్డారు.

ఇ-టికెట్ బుకింగ్ వెబ్ సైట్, యాప్ వర్కింగ్ :
టికెట్ బుకింగ్ సమయంలో ఎర్రర్ మెసేజ్ కనిపిస్తోందంటూ స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. మెయింటెనెన్స్ కారణంగానే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా మెసేజ్ కనిపించింది. కొన్ని గంటల తర్వాత ఎట్టకేలకు ఐఆర్‌సీటీసీ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఇ-టికెట్ బుకింగ్ వెబ్‌సైట్, యాప్ కూడా పనిచేస్తుంది. వినియోగదారులు తమ ట్రైన్ టికెట్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా బుకింగ్ చేసుకోవచ్చునని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

IRCTC Down due to technical reasons

భారత్‌లోని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆన్‌లైన్ రైల్వే టిక్కెట్లు, రైల్వేలకు క్యాటరింగ్ సర్వీసులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి భారత ప్రభుత్వంచే అధికారం పొందిన ఏకైక సంస్థ ఐఆర్‌సీటీసీ. ఏడేళ్ల టెండర్లకు రైల్వే బోర్డు అనుమతి ఇవ్వడంతో లగ్జరీ రైలు పర్యటనలు, హోటల్ బుకింగ్‌లు, హాలిడే ప్యాకేజీల వంటి విస్తృత శ్రేణి పర్యాటకంగా సంస్థ తన సర్వీసులను విస్తరించింది.

ఐఆర్‌సీటీసీ స్టాక్ 2.5శాతానికిపైగా పెరిగింది. గత ఆరు నెలల వ్యవధిలో స్టాక్ 16శాతం రాబడిని అందించింది. ఐఆర్‌సీటీసీ స్టాక్ గత 3 ఏళ్లలో 156శాతం అద్భుతమైన రాబడిని అందించింది. గత ఐదేళ్ల కాలంలో 1006శాతం పెరిగింది. క్యూ2ఎఫ్‌వై24లో కంపెనీ స్వతంత్ర నికర లాభంలో 30శాతం మెరుగుపడి 294 కోట్లకు చేరుకుంది.

Read Also : IRCTC Down : ఐఆర్‌సీటీసీలో సాంకేతిక లోపం.. స్తంభించిన సర్వీసులు.. యూజర్ల ఫిర్యాదులు!