WhatsApp New Rule
WhatsApp New Rule : వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. ఇకపై మెసేజింగ్ యాప్స్ ఉపయోగించే విధానం మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువస్తోంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారాల్లో ఇకపై సిమ్ బేసిడ్ యాక్సస్ తప్పనిసరి చేస్తోంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త రూల్స్ ప్రకారం.. మీరు WhatsApp, Telegram, Signal, Arattai, Snapchat, Sharechat వంటి ఏదైనా మెసేజ్ ప్లాట్‌ఫారాలను వినియోగించేవారికి వర్తించనున్నాయి. ఈ కొత్త నిబంధనలతో సిమ్ కార్డు లేకుండా వాట్సాప్ సహా ఇతర మెసేజింగ్ యాప్స్ వాడలేరు.
వాస్తవానికి.. ఈ యాప్‌లకు సిమ్ కార్డ్ వెరిఫికేషన్ వర్తిస్తుంది. వెబ్ ఆధారిత సెషన్‌లలో ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్ లాగ్అవుట్ తప్పనిసరి కానుంది. వినియోగదారులు యాప్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారి డివైజ్‌లో ఫిజికల్ సిమ్ కార్డ్ లేకపోతే ఇకపై ఈ మెసేజింగ్ సేవలను ఉపయోగించలేరు.
సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఈ ఆదేశాలను అమల్లోకి తెస్తోంది. వాట్సాప్ సహా ఇతర మెసేజింగ్ యాప్స్ యాక్సస్ విషయంలో ఎలాంటి నిబంధనలు వర్తించనున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం ప్రకారం.. ఈ కమ్యూనికేషన్ యాప్‌లు 90 రోజుల్లోపు, రిజిస్ట్రేషన్ సమయంలో వాడిన సిమ్ కార్డ్ వారి సర్వీసులను ఉపయోగించే డివైజ్‌లో ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. సిమ్ కార్డ్ లేకపోతే యాక్సెస్ బ్లాక్ అవుతుంది. సిమ్ బైండింగ్ వంటి టెక్నికల్ అవసరాల ద్వారా నిర్ణయిస్తారు.
ఇంకా, వాట్సాప్ వెబ్‌తో సహా ఈ యాప్‌ల వెబ్ ఆధారిత వెర్షన్‌లు ప్రతి 6 గంటలకు ఆటోమాటిక్‌గా లాగ్ అవుట్ చేయాల్సి వస్తుంది. తద్వారా సైబర్ మోసాలు భారీగా తగ్గుతాయని భావిస్తున్నారు.
సైబర్ సేఫ్టీ కోసమే :
సైబర్ మోసాల నుంచి వాట్సాప్ యూజర్లను ప్రొటెక్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ ప్రవేశపెడుతోంది. అసలైన కస్టమర్లను గుర్తించేందుకు మొబైల్ నంబర్లను వాడే కొన్ని యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సర్వీసులకు యూజర్లు తమ ఫోన్‌లో సిమ్ కార్డ్ లేకుండా సర్వీసును వినియోగించలేరు.
దేశం వెలుపల నుంచి వాట్సాప్ సైబర్ మోసాలకు పెరిగిపోతున్న నేపథ్యంలో టెలికాం సైబర్ భద్రతకు సవాలుగా నిలుస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే వాట్సాప్ యూజర్ల అకౌంట్ల లాగిన్ ఆటో లాగౌట్ అయ్యేలా నిబంధనల్లో మార్పులు చేయనుంది.
యూజర్లపై సిమ్ బైండింగ్ రూల్ ఎఫెక్ట్ :
భారతీయ యూజర్లు ఎక్కువగా వాట్సాప్ వినియోగిస్తున్నారు. రాబోయే ఈ కొత్త రూల్స్ వాట్సాప్ వినియోగంలో అనేక మార్పులు తీసుకురానుంది. చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు లేదా రెండు స్మార్ట్‌ఫోన్‌లు వంటి మల్టీ డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. కానీ, రెండు డివైజ్‌ల్లో ఒకే అకౌంట్ వాడేందుకు ఈ డివైజ్‌లను లింక్ చేస్తారు.
ఇకపై సిమ్-బైండింగ్ రూల్ వాట్సాప్ కనెక్టివిటీకి అంతరాయం కావచ్చు. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించే యూజర్లకు లాగౌట్ సమస్యగా మారొచ్చు. ఎందుకంటే.. వెబ్ ఆధారిత వాట్సాప్ లాగిన్ సెషన్‌లు ప్రతి 6 గంటలకు లాగ్ అవుట్ అవుతాయని గమనించాలి.