Offline UPI payments : ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్.. NFC ట్యాప్‌తో చెల్లింపులు.. ఎలా అంటే?

Offline UPI payments : త్వరలోనే భారత్ లోకి NFC సపోర్టుతో ఇంటర్నెట్ లేకున్నా ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Offline UPI payments

  • యూపీఐలో ఆఫ్ లైన్ పేమెంట్లకు కొత్త ఫీచర్ వస్తోంది
  • NFC సపోర్టుతో నెట్ లేకున్నా ఈజీగా డబ్బులు పంపుకోవచ్చు
  • ప్రతి యూపీఐ లావాదేవీకి గరిష్టంగా రూ.2వేల వరకు లిమిట్

Offline UPI payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్నెట్ లేకున్నా ఈజీగా యూపీఐ పేమెంట్లు చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? అతి త్వరలోనే భారత్‌లో యూపీఐ ఆఫ్ లైన్ పేమెంట్ల కోసం సరికొత్త ఫీచర్ రాబోతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే యూపీఐ ద్వారా పేమెంట్ చేసే కొత్త ఆఫ్‌లైన్ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఫీచర్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ముఖ్యంగా నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాలు, మెట్రో స్టేషన్లు, విమాన ప్రయాణాలు లేదా సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా యూపీఐ పేమెంట్లు వేగంగా పూర్తి చేయవచ్చు.

ఈ వ్యవస్థ NFC (Near Field Communication) టెక్నాలజీ ఆధారంగా రన్ అవుతుంది. అంటే, NFC సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను పేమెంట్ టెర్మినల్‌పై ట్యాప్ చేస్తే చాలు వెంటనే పేమెంట్ అయిపోతుంది. దీనికోసం ఇంటర్నెట్ అవసరం ఉండదు. అంతేకాదు, చిన్న మొత్తాల యూపీఐ పేమెంట్ల కోసం రూపొందించిన యూపీఐ లైట్ ద్వారా ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది.

Read Also : Honor Pad X9 Max : 10,100mAh భారీ బ్యాటరీతో 13-అంగుళాల హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ లాంచ్.. ధర ఎంతంటే?

వినియోగదారులు ముందుగానే యూపీఐ లైట్ వ్యాలెట్లలో డబ్బు లోడ్ చేసుకుని ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో ట్యాప్ చేసి పేమెంట్లు చేసుకోవచ్చు అనమాట. స్టోర్ వద్ద ఎన్ఎఫ్‌సీ సపోర్టు చేసే టెర్మినల్ వద్ద మీ ఫోన్ ట్యాబ్ చేస్తే సరిపోతుంది. దీనికి మీ యూపీఐ పిన్ కూడా అవసరం లేదు.

పేమెంట్ లిమిట్ రూ. 2వేలు :

ప్రతి యూపీఐ లావాదేవీకి గరిష్టంగా రూ.2వేల వరకు లిమిట్ ఉండే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దాంతో చిన్న మొత్తాల చెల్లింపులు వేగంగా పూర్తవుతాయి. ఈ సదుపాయం పొందాలంటే వ్యాపారులు వాడే PoS (పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్స్‌కు NPCI వెరిఫికేషన్ తప్పనిసరి. వెరిఫికేషన్ పూర్తి అయ్యాక బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు తమ యాప్‌ల ద్వారా ఈ సర్వీసును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావొచ్చు.

అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఎన్‌పీసీఐ లేదా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ప్రారంభ దశ నివేదికలు మాత్రమేనని గమనించాలి. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలపై క్లారిటీ వస్తుంది.