Smartphone Prices Hike : కొత్త ఫోన్ కొనేదెట్టా.. మండిపోతున్న మొబైల్ ధరలు.. ఏయే బ్రాండ్ ఫోన్లు ఎంత పెరిగాయంటే?
Smartphone Prices Hike : కొత్త ఫోన్ కొనడం కష్టమే.. మార్కెట్లో మొబైల్ ధరలు మండిపోతున్నాయి. ఏ బ్రాండ్ ఫోన్ చూసినా ధరల మోత మోగిస్తున్నాయి. మీ ఫేవరెట్ ఫోన్ ధర ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉందో తెలుసా?
- Sreehari A
- Updated on- August 21, 2026 / 11:37 AM IST
Smartphone Prices Hike
- మెమొరీ, చిప్ సెట్స్ ధరలు పెరగడమే కారణం
- శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్‌మి కంపెనీలు
- ఏ బ్రాండ్ ఫోన్ల ధరలు ఎంతవరకు పెంచాయంటే?
- మరో 7-10 శాతం ధరలు పెరిగే అవకాశం
Smartphone Prices Hike : బాబోయ్.. స్మార్ట్ ఫోన్ కొనాలా? వద్దా? వరుసబెట్టి ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు పోటీపడి మరి ఫోన్ల ధరలు అమాంతం పెంచేస్తున్నాయి. రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ల ధరలు ఆకాశానంటుతున్నాయి. ఇప్పటివరకూ తక్కువ ధరకే దొరికిన ఫోన్లు ఇప్పుడు డబుల్, ట్రిపుల్ ధరలకు అమ్ముడవుతున్నాయి.
లాంచ్ ధర కన్నా ఎక్కువకే ధర పలుకుతున్నాయి. ఇంతగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగడానికి అసలు కారణం ఏంటంటే.. మెమరీ చిప్ రేట్లు పెరగడమే.. ఈ ఖర్చును పూడ్చుకునేందుకు మొబైల్ కంపెనీలు ఫోన్ల ధరలు పెంచుతూ పోతున్నాయి.
ఇప్పటికే రియల్ మి, ఒప్పో, వివో, శాంసంగ్, వన్ ప్లస్ తయారీ కంపెనీలు తమ ఫోన్లను ధరలను భారీగా పెంచాయి. ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే చిప్ రేట్లు పెరగడమే ప్రధాన కారణమని చెబుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు ఇప్పుడు ఫోన్లు కొనాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు.
ఆచితూచి మరి ఖర్చు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల సేల్స్ కూడా భారీగా తగ్గాయి. ఈ ఏప్రిల్, జూన్ త్రైమాసిక సేల్స్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బాగా తగ్గాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ లేటెస్ట్ నోట్ వెల్లడించింది. ఇంతకీ ఏయే మొబైల్ కంపెనీలు ఎంతెంత ధరలను పెంచాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏయే బ్రాండ్ల ధరలు ఎంత పెరిగాయి? :
ఈ నెల 18 నుంచి రియల్‌మి కంపెనీ అనేక రియల్ మి మోడళ్ల ధరలను రూ. 1000 నుంచి రూ. 4వేల వరకు పెంచింది. ఒప్పో కూడా తమ రెనో సిరీస్ ఫోన్లలో ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై రూ. 5వేల వరకు పెంచింది.
కొన్ని చోట్ల వివో నుంచి పలు మోడళ్ల ధరలు రూ. 500 నుంచి రూ. 4వేల వరకు పెరిగాయి. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా S, M, F సిరీస్ ఫోన్లలో ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను భారీగా పెంచేసింది. గెలాక్సీ S25లో సింగిల్ వేరియంట్ ధర రూ. 12వేలు పెంచింది.
మళ్లీ 7-10 శాతం పెరిగే ఛాన్స్ :
మెమెరీ, చిప్ రేట్లు పెరగడమే స్మార్ట్ ఫోన్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం వరకు పెరిగాయని ఐడీసీ ఏషియా పసిఫిక్ సనీయిర్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి వెల్లడించారు. రాబోయే నెలల్లో కూడా మరో 7 నుంచి 10 శాతం వరకు పెరగుతాయని అంచనా వేశారు. ఈ ఖర్చు భారాన్ని కంపెనీలు వినియోగదారులపై వేయక తప్పడం లేదని అంటున్నాయి.
కొత్త స్మార్ట్ ఫోన్లను కూడా అధిక ధరలకే లాంచ్ చేస్తున్నాయి. అయితే, ధరల పెంపు ఫోన్ల విక్రయాలపై కూడా ప్రభావం పడింది. గత నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్, ఫ్లిప్ కార్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సేల్ సందర్భంగా కంపెనీలు అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు గుప్పించడంతో సేల్స్ కొద్దిగా పుంజుకున్నట్టుగా కనిపించినా కొన్ని వారాల్లోనే అమ్మకాలు ఒక్కసారిగా తగ్గాయని అంటున్నారు.
రాబోయే పండగ సీజన్ సమయంలో మొబైల్ కంపెనీలు మళ్లీ సబ్సిడీలు, ఈఎంఐలు, కొత్త మోడళ్లను డిస్కౌంట్లతో ఆఫర్ చేస్తే మళ్లీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
