Samsung Galaxy S25 Edge
శాంసంగ్ ఈ ఏడాది జనవరిలో గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 25, ఎస్ 25+, ఎస్ 25 అల్ట్రా మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో త్వరలోనే గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ వేరియంట్‌ను కూడా తీసుకొస్తామని అప్పట్లోనే చెప్పింది. ఫిబ్రవరిలో బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ – 2025లో దీన్ని ప్రదర్శించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు పలు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. మే నుంచి మార్కెట్లో అది అందుబాటులోకి వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ వేరియంట్‌ను ఎన్నో అప్‌డేట్లతో తీసుకొస్తుంది.
ధర ఎంత ఉండొచ్చు?
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ 256 జీబీ వేరియంట్ ధర గ్లోబల్ మార్కెట్లో సుమారు రూ.1,12,000 నుంచి రూ.1,21,500 మధ్య ఉండొచ్చు. శాంసంగ్ ఫోన్‌ను భారత్‌లో సుమారు రూ.1,05,000 ధరకు అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. ఇది గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా కంటే చౌక. గెలాక్సీ ఎస్ 25+కన్నా ఖరీదైనది.
ఫీచర్లు
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఫోన్ స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ఇది 6.65-అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఇది గెలాక్సీ S25+లోని స్కీన్ (6.7-అంగుళాలు) లాగే ఉంటుంది. హైక్వాలిటీ డిస్‌ప్లే కావాలనుకునే వారు గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవచ్చు.
గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ సూపర్ స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్‌తో కేవలం 5.84 మి.మీ. మందంతో వస్తుంది. ఇది 162 గ్రాముల కన్నా తక్కువ బరువుతో విడుదల కానుంది. ఇందులో శాంసంగ్ టైటానియం ఫ్రేమ్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీల కోసం 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఇది రావచ్చు. అయితే, గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ కేవలం 3,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్నట్లు తెలుస్తోంది.