Topmate Startup
Topmate Startup : ఇదేందిరయ్యా.. వస్తువులను డెలివరీ చేయడం చూశాం.. మనుషులను డెలివరీ చేయడమేంటి? పిచ్చి కాకపోతే అంటారా? దీని గురించి విన్న ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. ఒకప్పుడు, కిరాణా సామాగ్రిని కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయవచ్చని అనుకోవడం పిచ్చిగా అనిపించింది.
కానీ, ఆ తర్వాత బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ అది నిజం చేసి చూపించాయి. ఆ తర్వాత ప్రతిదీ మారిపోయింది. అయితే, కిరాణా సామాగ్రి డెలివరీ చేసే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ గురించి ఇక మర్చిపోండి.. ఇప్పుడు మనుషులను కూడా కేవలం 10 నిమిషాల్లోనే చేస్తామంటూ ఒక స్టార్టప్ కంపెనీ చెబుతోంది.
ఇదెక్కడి చోద్యం.. మనుషులను డెలివరీ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అవును.. మీరు విన్నది నిజమే. కొత్త భారతీయ స్టార్టప్ టాప్‌మేట్.. ఇప్పుడు 10 నిమిషాల్లో మనుషులను “డెలివరీ” చేయడం సాధ్యమేనని అంటోంది. కొత్త స్టార్టప్ ప్రకటనకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కెరీర్ గైడెన్స్ కోసం వినూత్న ఆలోచన :
ఇంతకీ, మనుషులను డెలివరీ చేయడమేంటి అనుకుంటున్నారా? ఏమిలేదు.. స్టార్టప్ టాప్‌మేట్ సంస్థ కెరీర్ గైడెన్స్ కోరుకునే యాప్ యూజర్ల కోసం 10 నిమిషాల్లో నిపుణులను పంపిస్తామని చెప్పుకుంటోంది. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించింది.
అందులో భాగంగానే.. ఏఓ ప్లాట్‌ఫామ్ ద్వారా కెరీర్ గైడెన్స్, సందేహాలకు సమాధానాలు, లక్ష్యాలను సాధించాలనుకునే వారికి సాయం అందించేందుకు నిపుణులను నేరుగా 10 నిమిషాల్లో సంప్రదించే అవకాశాన్ని అందిస్తోంది. ఆయా రంగాలలో నైపుణ్యం సాధించిన నిపుణులు తక్షణమే మీకు అందుబాటులో ఉంటారని కంపెనీ చెబుతోంది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్‌ను కూడా షేర్ చేసింది.
గ్రాసరీలు మాత్రమే కాదు.. మనుషులు కూడా డెలివరీ చేస్తాం :
ఇప్పుడు, టాప్‌మేట్ ప్రకటన ఇంటర్నెట్‌ను సైతం ఆశ్చర్యపరిచింది. అనేక చర్చలకు దారితీసింది. ఇదేలా సాధ్యం అన్నట్టుగా ఆశ్చర్యపోవాలా లేదా సందేహించాలా అనే సందిగ్ధం నెలకొంది. టాప్‌మేట్ ప్రకటనకు సంబంధించి నిముషా చందా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. “బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్‌లకు బైబై చెప్పేయండి.. ఎందుకంటే మేం కేవలం 10 నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడమే కాదు.. మనుషులకు కూడా డెలివరీ చేస్తున్నాము” ఆమె రాసుకొచ్చారు.
It’s OVER for Blinkit, Zepto, and Instamart.
Because we’re not just delivering groceries in 10 minutes—we’re delivering humans.
Humans who can:
– Answer every question you throw at them
– Help you land your dream job
– Be your ultimate growth partnersTry here -… pic.twitter.com/FK9ULELHHX
— Nimisha Chanda (@NimishaChanda) February 7, 2025
ఇంతకీ డెలివరీ చేసిన మనుషులు ఏమి చేస్తారో కూడా ఆమె వివరణ ఇచ్చారు. మీరు వారిని అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తారు. మీ కలల ఉద్యోగాన్ని పొందడంలో మీకు సాయం చేస్తారని పేర్కొన్నారు. “ఇక ఊహాగానాలు లేవు. గూగుల్ సెర్చ్ చేయడం లేదు. మా నిపుణులను తక్షణమే సంప్రదించగలిగితే సరిపోతుంది. టాప్‌మేట్ ద్వారా ’10 నిమిషాల్లో మీకు సందేహాలకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ చందా చెప్పుకొచ్చారు.
ఈ ప్రకటనపై నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం :
టాప్‌మేట్ వెబ్‌సైట్ ఎలా పనిచేస్తుందో చూపించే వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇప్పుడా ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. నెట్టింట్లో ఈ పోస్టుకు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి కొంతమంది వినియోగదారులు ఈ వ్యాపార ఆలోచనను ప్రశంసించగా, చాలామంది సందేహాన్ని వ్యక్తం చేశారు.
“ఆసక్తికరంగా ఉంది. అయితే, అభిప్రాయాల విషయానికి వస్తే.. ప్రజలు సాధారణంగా ఉత్పత్తుల మాదిరిగా కాకుండా ఉచితమైన వాటి కోసం చూస్తారు. ఈ విభాగం ఎంత పెరుగుతుందో ఏదైనా డేటా పాయింట్లు ఉన్నాయా?” ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. “’10 నిమిషాల్లో సిఫార్సు’ అనేది ఒక రకమైన అనుమానం. ఇది రిఫరల్స్ పని చేయాల్సిన విధానం కాదు” మరో యూజర్ రాసుకొచ్చారు.
మరికొందరు నెటిజన్లు ఈ విధానంపై నైతిక చిక్కులను కూడా ప్రశ్నించారు, “రిఫెరల్ పొందడానికి చెల్లించాలా? కంపెనీలు దీని గురించి ఎలా భావిస్తాయో నాకు ఆశ్చర్యంగా ఉంది. వారు ఈ వ్యక్తులను బయటకు పంపలేదా?” అని ఒక యూజర్ ప్రశ్నించారు. చాలామంది దీనిని సాంప్రదాయ కన్సల్టింగ్ సంస్థలతో పోల్చారు. “ఇది కన్సల్టెంట్‌ను నియమించుకోవడానికి ఎలా భిన్నంగా ఉంటుంది?” అని పేర్కొన్నాడు. మరొకరు “ఇది కేవలం కన్సల్టెన్సీ సర్వీసు కాదా?” అని మరో యూజర్ కామెంట్ చేశారు.