India AI Impact Summit 2026
India AI Impact Summit 2026 : ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ప్రస్తుతం భారత్‌లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖ నేతలు, టెక్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. హాజరు కాలేకపోయిన వారు యూట్యూబ్ వేదికగా వీక్షిస్తున్నారు. ఈ సమ్మిట్‌లో రణవీర్ సచ్‌దేవా అనే 8ఏళ్ల బాలుడు అందరి దృష్టిని ఆకర్షించాడు.
అతి పిన్న వయస్కుడైన స్పీకర్ :
ఈ సమ్మిట్‌లో అతి పిన్న వయస్కుడైన కీలక స్పీకర్‌గా నిలిచాడు. చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకున్న రణవీర్‌ను దేశంలోనే అతి పిన్న వయస్కుడైన టెక్ ఔత్సాహికుడు, యువ కోడర్‌గా పరిచయమయ్యాడు. కేవలం 8 ఏళ్ల వయసులోనే భారత్‌కు చెందిన రణ్‌వీర్ సచ్‌దేవా అత్యంత ఘనతను సాధించాడు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో రణ్‌వీర్ అతి పిన్న వయస్కుడైన కీనోట్ స్పీకర్ అయ్యాడు. రణ్‌వీర్ సాంకేతిక నిపుణుడు మాత్రమే కాదు. ప్రపంచ రచయిత కూడా. రణ్‌వీర్ తనను తాను యువ రాయబారిగా సాంకేతిక నిపుణుడిగా, ప్రపంచ రచయితగా, అంతర్జాతీయ వక్తగా అభివర్ణించుకున్నాడు.
రణ్‌వీర్ ప్రతిభతో టెక్ ప్రపంచంలో చాలా మంది టెక్ దిగ్గజాలను కలిశాడు. ఈ సమ్మిట్ సందర్భంగా అతను సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మన్‌లను కలిశాడు. గూగుల్, ఓపెన్‌ఏఐ, ఏఐ రంగంలో ప్రముఖ సంస్థలుగా దూసుకుపోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో రణ్‌వీర్ షేర్ చేసి తన అనుభవాలను పంచుకున్నాడు.
అనేక అంతర్జాతీయ వేదికలపై కనిపించి.. :
గతంలో అంతర్జాతీయ వేదికలపై రణ్‌వీర్ కనిపించి అందరిని అబ్బురపరిచాడు. జెనీవాలో జరిగిన ఏఐ ఫర్ గుడ్ సమ్మిట్‌లో ఆయన మార్క్ బెనియోఫ్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సెక్రటరీ జనరల్ డోరీన్ బోగ్డాన్-మార్టిన్‌లను కలిశారు. 2024లో ఆయన యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కలిసే అవకాశం ఉంటుంది. 2023లో న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన ఆపిల్ అధిపతి టిమ్ కుక్‌ను కూడా కలిశారు.
3 ఏళ్ల నుంచే కోడింగ్ నేర్చుకుంటూ.. :
రణ్‌వీర్‌కి చిన్నప్పటి నుంచీ టెక్నాలజీపై ఆసక్తి ఉంది. అతని కుటుంబం ప్రకారం.. 3 ఏళ్ల వయస్సులోనే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. చిన్న వయస్సులోనే చిన్న డిజిటల్ ప్రాజెక్టులను క్రియేట్ చేయడం ప్రారంభించాడు. లైవ్ సెషన్‌లో కోడింగ్ స్కిల్స్ కూడా ప్రదర్శించాడు. 2022 గ్లోబల్ రీడింగ్ ఛాలెంజ్‌లో సూపర్ ప్రెజెంటర్‌గా గోల్డ్ మెడల్ అందుకున్నాడు. దాదాపు 6 ఏళ్ల వయస్సులో అతను టెక్నాలజీ, ఆవిష్కరణలపై మాట్లాడుతున్న అతి పిన్న వయస్కుడైన TEDx స్పీకర్లలో ఒకరిగా నిలిచాడు.
సైన్స్ పట్ల ఆసక్తి :
మీడియా నివేదికల ప్రకారం.. రణ్‌వీర్ అంతరిక్షం, విజ్ఞాన శాస్త్రంపై అపారమైన ఆసక్తి ఉంది. అంగారక గ్రహానికి సంబంధించిన భావనల ఆధారంగా ఒక ఏఐ మోడల్ రూపొందించాడు. ఈ ఆసక్తి అతనికి యూఎస్ అంతరిక్ష సంస్థ NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నుంచి గుర్తింపు రావడంతో చర్చలకు దారితీసింది. చిన్న వయస్సులోనే టెక్నాలజీ, ఏఐ, ఆవిష్కరణలలో చురుకైన ప్రమేయంతో రణ్‌వీర్ సచ్‌దేవా పేరు ఇప్పుడు యువ టెక్ ప్రముఖుల్లో ఎక్కువగా వినిపిస్తోంది.
రణవీర్ మాట్లాడుతూ.. ‘నేను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో అతి పిన్న వయస్కుడిగా పాల్గొంటున్నాను. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాన్ని మోడ్రాన్ టెక్నాలజీతో ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నానో మాట్లాడుతాను.
ఏఐని డెవవలప్ చేసేందుకు ఇతర దేశాలు ఉపయోగిస్తున్న వివిధ విధానాలను కూడా చర్చిస్తాను. భారత్ ఏఐని ఎలా నిర్మిస్తుందనే కూడా మాట్లాడుతాను. ఇటీవల రిలీజ్ చేసిన నా భారతీయ ఏఐ మోడల్ వినియోగ కేసును కూడా షేర్ చేస్తాను. భారత జీడీపీకి ఏఐ అక్షరాస్యతను ఎలా ప్రోత్సహిస్తుందో వివరిస్తాను” అని చెప్పుకొచ్చాడు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏంటి? :
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. గ్లోబల్ సౌత్‌లో అతిపెద్ద ఏఐ సమ్మిట్. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగే ఈ సమ్మిట్‌లో ప్రముఖులు, టెక్ కంపెనీల సీఈఓలు హాజరైన అనేక సెషన్‌లు జరిగాయి.
అనేక కంపెనీలు కూడా తమ ప్రొడక్టులను ప్రదర్శించాయి. ఈ సమ్మిట్ ఏఐ రంగంలో గణనీయమైన మార్పును తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా చేయడం, అభివృద్ధి కోసం అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది.