Who Will Dominate India's Satellite Internet Space ( Image Source : Google )
India’s Satellite Internet Space : భారత శాటిలైట్ ఇంటర్నెట్ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ఇద్దరు అపర కుబేరుల మధ్య తీవ్రపోటీ కొనసాగుతోంది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలతో స్టార్‌లింక్‌ను ప్రవేశపెట్టేందుకు టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయంలో దేశీయ బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాంతో ఇద్దరు సంపన్నుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలంపాటతో కాకుండా పాలనాపరంగా కేటాయిస్తామని ఇటీవలే ప్రభుత్వం ప్రకటన చేయడంతో వీరి మధ్య పోటీ మరింత వేడిక్కింది.
ఒకవైపు అంబానీ స్పెక్ట్రమ్ వేలం విధానాన్ని డిమాండ్ చేస్తుంటే.. మస్క్ ప్రణాళికలు మరోలా ఉన్నాయి. శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ సేవలను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా సులభంగా అందించే అవకాశం ఉంటుంది. అయితే, స్పెక్ట్రమ్ ధరలపై ట్రాయ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కమర్షియల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు కూడా ప్రారంభం కాలేదు. ప్రస్తుత టెలికం మార్కెట్లో శాటిలైట్ ఇంటర్‌నెట్ స్పెక్ట్రమ్ విషయంలో జియోతో పాటు ఇతర సంస్థలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మస్క్‌కు స్టార్‌లింక్ ‘లోఎర్త్ ఆర్బిట్’ శాటిలైట్లతో వేగంగా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోంది. శాటిలైట్ల ద్వారా వచ్చే సిగ్నల్స్ భూమిపై రిసీవర్లు గ్రహించి ఇంటర్‌నెట్ డేటాగా అందిస్తాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో స్టార్‌లింక్ సంస్థకు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. మస్క్ కన్ను భారత్‌పై పడింది. అప్పటినుంచి స్టార్‌లింక్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ, ఇందుకు ప్రభుత్వ నియంత్రణ విధానాలతో మరింత జాప్యం అవుతుంది. స్టార్‌లింక్ భారత్‌కు వస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపుపై భారత ప్రభుత్వ నిర్ణయంపై ముఖేశ్ అంబానీ సంప్రదింపులు జరుపుతున్నారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. మస్క్ దీనిపై స్పందిస్తూ.. ముఖేశ్ అంబానీకి తాను ఫోన్ చేస్తానని చెప్పారు. భారత్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అని అడుగుతానని ఆయన పేర్కొన్నారు.
స్టార్‌లింక్ వస్తే.. ఇంటర్నెట్ ధరలు తగ్గుతాయా? :
ఓ నివేదిక ప్రకారం.. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్లకు చెల్లించే ధరల కన్నా స్టార్‌లింక్ చార్జీలు 10 రెట్లు ఎక్కువనే చెప్పాలి. ప్రభుత్వం రాయితీలు లేకుండా స్టార్‌లింక్ భారతీయ టెలికాం ఆపరేటర్లతో పోటీ కష్టమే. ఎందుకంటే.. స్టార్‌లింక్ అందించే శాటిలైట్లు సర్వీసుల ప్రయోగం, నిర్వహణ ఖర్చులు భారం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టార్ లింక్ వచ్చినా ఇంటర్నెట్ ధరలు పెరిగే అవకాశం ఉండకపోవచ్చునే వాదనలు వినిపిస్తున్నాయి. భూమిపై ఆపరేట్ చేసే నెట్‌వర్క్ లేనప్పుడే శాటిలైట్ ఇంటర్నెట్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది.
అది కూడా మారుమూల గ్రామాలు వంటి ప్రాంతాల్లో మాత్రమే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఎక్కువగా అవసరం పడతాయి తప్పా పట్టణ పరిసర ప్రాంతాల్లోని వినియోగదారులు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులపై ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉండదని అంటున్నారు. అందులోనూ శాటిలైట్ ఇంటర్నెట్ కన్నా భూతలంలో ఇంటర్నెట్ సర్వీసులకే చౌకైనవిగా చెప్పవచ్చు.
భారత మార్కెట్లో ఇంటర్నెట్ వాడకం ఎక్కువ. అందుకే మస్క్ కూడా భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టవిటీని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. భారత జనాభాలో దాదాపు 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సర్వీసులు లేవని పలు నివేదికలు సైతం వెల్లడించాయి. భారత్‌లో 75 కోట్ల మందితో పోలిస్తే.. చైనాలో 34 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారని ఎక్కువగా ఉన్నారని ఓ డేటారిపోర్టల్ పేర్కొంది. అంతర్జాతీయంగా పరిశీలిస్తే.. భారతీయ ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకబడి ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Read Also : మోదీ, జిన్‌పింగ్ భేటీ వేళ.. 2019 నుంచి భారత్, చైనా మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూద్దామా?