Telegram App Store : బిగ్ షాక్.. ఆపిల్ యాప్ స్టోర్‌లో టెలిగ్రామ్ మాయం.. కొత్తగా డౌన్‌లోడ్‌ చేయలేరు.. అసలు రీజన్ ఇదే!

Telegram App Store : టెలిగ్రామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ iOS యాప్ స్టోర్ నుంచి తొలగించింది.. దీనికి అసలు కారణాలంటే ఇప్పుడు చూద్దాం..

Telegram App Store

  • ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ iOS యాప్ స్టోర్ నుంచి టెలిగ్రామ్ తొలగింపు
  • ఆపిల్ యూజర్లు ఇకపై టెలిగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు.
  • ముందే ఫోన్లలో ఇన్‌స్టాల్ టెలిగ్రామ్ యాప్ వర్క్ అవుతుంది

Telegram App Store : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాకింగ్.. ఆపిల్ ఐఫోన్లలో టెలిగ్రామ్ ఉన్నట్టుండి మాయమైంది.. యాప్ కోసం సెర్చ్ చేసిన ఆపిల్ స్టోర్‌లో కనిపించడం లేదు. ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఆపిల్ iOS యాప్ స్టోర్‌లో కనిపించడం లేదనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐఫోన్ యూజర్లు కొత్తగా టెలిగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయలేకపోతున్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు ఆపిల్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కానీ, ఇప్పటికే ఐఫోన్లలో టెలిగ్రామ్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఫోన్లలో టెలిగ్రామ్ యాప్ ఎప్పటిలాగే పనిచేస్తోంది. యూజర్లు ఎవరికైనా మెసేజ్ పంపుకోవచ్చు. ఇతరుల నుంచి మెసేజ్ కూడా పొందవచ్చు. పుష్ నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ కేవలం కొత్త యాప్ డౌన్‌లోడ్‌లు, యాప్ అప్‌డేట్‌లకే మాత్రమే వర్తించనుంది.

టెలిగ్రామ్ తొలగింపు ఫస్ట్ టైమ్ కాదు :

ఆపిల్ కంపెనీ టెలిగ్రామ్ తొలగించడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో 2018లో కూడా ప్లాట్‌ఫారమ్‌లో అభ్యంతరకరమైన కంటెంట్‌కు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ఆపిల్ టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా యాప్ స్టోర్ నుంచి తొలగించింది. అనంతరం కంటెంట్ మోడరేషన్ సిస్టమ్ అప్ గ్రేడ్ చేశాక యాప్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆపిల్ యాప్ స్టోర్ గైడ్‌లైన్స్ ప్రకారం.. :

యూజర్లు కంటెంట్ క్రియేట్ చేసే యాప్‌లలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేసే సిస్టమ్, కంప్లయింట్ చేసే టూల్స్, దుర్వినియోగం చేసే యూజర్లను బ్లాక్ చేసే ఫీచర్లు, అలాగే యూజర్ల హెల్ప్ కోసం సపోర్ట్ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధనలను పాటించని యాప్‌లను తమ ప్లాట్ ఫారం నుంచి ఆపిల్ ఏరిపారేస్తోంది.

2024 ఏప్రిల్‌లో జాతీయ భద్రతా కారణాలతో చైనా ప్రభుత్వం ఆదేశాల మేరకు టెలిగ్రామ్‌తో పాటు వాట్సాప్, సిగ్నల్, థ్రెడ్స్ వంటి యాప్‌లను చైనా యాప్ స్టోర్ నుంచి ఆపిల్ తొలగించింది. అయితే, ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో లేదు. దీనికి అసలు కారణం ఏంటి? అనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఆపిల్, టెలిగ్రామ్ సంస్థల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.