బయటపడ్డ రేవంత్‌ రెడ్డి భూబాగోతాలు.. 10tv చేతిలో ఆర్డీవో రిపోర్ట్

రేవంత్ రెడ్డి చేసిన భూ అక్రమాల వివరాలు బట్ట బయలు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఇందుకు సంబంధించిన వివరాలను 20 పేజీల్లో రెడీ చేశారు. వందల కోట్లలో విలువైన భూములను ఆక్రమించినట్లుగా స్పష్టమైంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2005లో పహాణీలో రెవెన్యూ అధికారుల సహాయంతో అడ్డదిడ్డంగా మార్పులు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి. 

A.రేవతి రెడ్డి W/o నర్సింహారెడ్డిగా పహాణీలో ఉన్న పేరును అనుముల రేవంత్‌రెడ్డి S/o నర్సింహారెడ్డిగా మార్చేశారు. వందల కోట్ల విలువైన భూములను కబ్జా చేయడానికి అడ్డదారులు తొక్కిన రేవంత్‌ బ్రదర్స్‌
పహాణీలను పూర్తిగా మార్చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ అనుమానంతోనే నిర్దారణ కోసం పహాణీలను ఫోరెన్సిక్‌కు పంపారు. 

దీనికి సంబంధించిన గోపన్‌పల్లి సర్వే నెంబర్‌ 127లో జరిగిన భూ లావాదేవీలను నివేదికలో వివరంగా పేర్కొన్నారు. సర్వే నెంబర్‌ 126 కోమటికుంటలో ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లోనూ ఎకరా 14 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్న రేవంత్. సర్వే నెంబర్ 34లోనూ ఎకరా 11 గుంటల రేవంత్ సోదరులు భూ కబ్జా చేశారు. 

ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రయివేట్ భూములను సైతం రేవంత్ బ్రదర్స్‌ వదల్లేదు. కబ్జాలతో చెరువులోకి నీళ్లు రాకుండా రేవంత్ అడ్డుకట్ట వేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన రేవంత్ బ్రదర్స్‌ యథేచ్చగా రెచ్చిపోయారు. 

  • వందేళ్ల నుంచి ఉన్న గోపనపల్లి రోడ్డు వరకూ.. 
  • సర్వే 127లో బండ్లబాటనూ.. 
  • సర్వే నెం 128, 160ల్లోనూ 10 గుంటల ప్రయివేట్ స్థలాన్ని కబ్జాచేసి గేట్లు పెట్టేసుకున్నారు. 
  • సర్వే నెంబర్ 127లోనూ ఐదెకరాల 21 గుంటలు కూడా టైటిల్ ఫేక్ అని విచారణలో నిర్ధారణ

2005లో ఇష్టానుసారంగా రికార్డులను తారుమారు చేసిన అప్పటి రెవెన్యూ అధికారులు. ఇతరులతో కలిసి రేవంత్‌  పేరిట పహాణీలో 10 ఎకరాల 21 గుంటల భూమి నమోదైంది. 127 సర్వే నెంబర్‌లో 10 ఎకరాల 21 గుంటల భూమిని 13 ఎకరాల 11గుంటలుగా రెవెన్యూ అధికారులు నమోదు చేశారు. సర్వే నెంబర్‌ 34లోని ప్రభుత్వ భూమి, గ్రామ రోడ్డును కూడా 127 సర్వే నెంబర్‌లోని ప్రైవేటు భూమిలో కలిపినట్లు ఆర్డీవో గుర్తించారు. 

కోమటి చెరువు శిఖం భూమిలోనే కాంపౌండ్‌ వాల్‌ నిర్మించిన  రేవంత్‌ రెడ్డి. అవకతవకలకు పాల్పడినందుకు గానూ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మరో ఇద్దరు తహసీల్దార్లు అక్రమాలకు పాల్పడ్డట్లు నివేదికలో పొందుపరిచారు ఆర్డీవో చంద్రకళ. రికార్డుల తారుమారు ప్రక్రియలో రాజేశ్వర్‌రెడ్డి, సుబ్బారావులు కూడా భాగమయ్యారు. 

సర్వే నెంబర్‌ 128, 160లకు చెందిన 10 గుంటల భూమిని కూడా కబ్జా చేశారు. రేవంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డిలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినట్లు చంద్రకళ తెలిపారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి సోదరులపై ఈ భూములకు సంబంధించి 7 కేసులు నమోదయ్యాయి. రిపోర్టును బట్టి అందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.