భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గని దగ్గర ప్రమాదం.. డంపర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

  • Publish Date - December 15, 2020 / 10:49 AM IST

A man killed in road accident : భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గని దగ్గర ప్రమాదం జరిగింది. డంపర్‌ వాహనం ఢీకొని లింగయ్య అనే గ్రామస్తుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. సింగరేణి ఓసీ సేఫ్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. సింగరేణి ఆఫీస్‌లో వాహనాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఓపెన్‌కాస్ట్‌ గని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

బొగ్గు వెలికితీసే డంపర్ వాహనం ఢీకొని అదే గ్రామానికి చెందిన జడల లింగయ్య గ్రామస్తుడు మృతి చెందాడు. సింగరేణికి సంబంధించిన కాకతీయ ఉపరితల గని సెక్టార్ 2 లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న బంధువులు, గ్రామస్తులు సింగరేణి ఓసీ సేఫ్టీ ఆఫీస్‌ కు వెళ్లి అధికారులను నిలదీశారు.

ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తమ గ్రామస్తున్ని చంపడమే కాకుండా సరైన సమాధానం చెప్పడం లేదని కోపోద్రిక్తులపై గ్రామస్తులు కార్యాలయంపై దాడి చేసి వాహనాలు, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సేఫ్టీ అధికారిపై దాడి చేశారు.

సింగరేణి అధికారులు వారించే ప్రయత్నం చేసినా గ్రామస్తులంతా ఒక్కసారిగా తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లింగయ్య మృతికి కారకులెవరో తెలపాలి..అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనిని మూసి వేయాలని డిమాండ్ చేశారు. ఓపెన్‌కాస్ట్‌ గని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.