హామీ అమలు చేయాలనే పట్టుదల.. నిధుల కోసం రేవంత్‌ సర్కార్ చర్చోపచర్చలు

ఇలాంటి క్లిష్ట సమయంలో అంబేద్కర్ అభయ హస్తం పథకానికి నిధులను సేకరించడం ఎలా అన్నదానిపై రేవంత్ సర్కార్ తర్జనభర్జనలో ఉంది.

CM Revanth Reddy

ఎన్నో ఆశలు..మరెన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం.. అన్నింటికీ మించి దళితుల మేలు కోసం అమలు చేయాల్సిన పథకం. ఇది ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ను ఆలోచనలో పడేసింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన దళితబంధు స్కీమ్‌ను అంబేద్కర్ అభయ హస్తం పేరుతో అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ పది లక్షలు ఇస్తే తాము 12 లక్షలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్.

అధికారంలోకి వచ్చి కూడా పది నెలలు కావస్తుంది. దీంతో అంబేద్కర్ అభయ హస్తం పథకం అమలు ఎలా అని రేవంత్ సర్కార్ చర్చోపచర్చలు చేస్తోంది. నిధుల సేకరణే రేవంత్‌ సర్కార్‌కు సవాల్‌గా ఉంది. ఇప్పటికే 4వేల పెన్షన్ అందడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అంతేకాదు కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఏమైందన్న ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇదే టైమ్‌లో దళితబంధుపై కూడా ప్రభుత్వంపై ప్రెజర్ పెరుగుతోంది.

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనర్హులకు కూడా ఈ స్కీమ్ వర్తింప జేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గులాబీ పార్టీ కార్యకర్తలు, నేతల అనుచరులు, కుటుంబ సభ్యులకు దళితబంధు ఇచ్చారని విమర్శిస్తోంది. రాజకీయ పదవుల్లో ఉన్నవారికి కూడా బీఆర్ఎస్ సర్కార్ దళితబంధు ఇచ్చిందని అంటున్నారు. అయితే గత ప్రభుత్వం దళిత బంధు అమలు, లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ వంటి అన్ని బాధ్యతలు కలెక్టర్లకే అప్పగించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జ్‌ మంత్రులను నియమించింది. లబ్ధిదారుల ఎంపికలో మంత్రులను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అంబేద్కర్ అభయ హస్తం ఆశావాహులు ఎక్కువగా ఉండటం..నిధుల కొరత నేపథ్యంలో దశలవారీగా ఆర్థిక సాయం చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో 10 లక్షలు ఇస్తే..అందులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటి సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల తీరుపై బహిరంగంగానే ఆరోపణలు చేయడం..చర్చనీయాంశమైంది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, అవినీతి మళ్లీ రిపీట్ కాకుండా పకడ్బందీగా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుతవ్ం దళితబంధు కింద 38 వేల మందికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం కూడా నిధుల కొరత వల్లే పూర్తిస్థాయిలో దళిత బంధును అమలు చేయలేకపోయింది.

ఇప్పుడు 10 లక్షల స్థానంలో ఒక్కొక్కరికి 12 లక్షల ఆర్ధికసాయం చేయడమంటే తలకు మించి భారం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ అభయ హస్తం స్కీమ్ అమలు చేస్తే 14 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ అమలు చేయడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆర్ధిక భారం పడింది.

రైతు భరోసాకు నిధులు లేక వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మిగతా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో అంబేద్కర్ అభయ హస్తం పథకానికి నిధులను సేకరించడం ఎలా అన్నదానిపై రేవంత్ సర్కార్ తర్జనభర్జనలో ఉంది. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా అంబేద్కర్ అభయ హస్తం పథకం నిధుల ప్రస్తావన లేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్ దళితబంధు పథకానికి మంగళం పాడిందని విమర్శిస్తోంది.

దళిత వర్గాల నుంచి వ్యకతిరేకత రావొద్దంటే స్కీమ్‌ను అమలు చేసి తీరాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. రుణం తేస్తామా మరేదైనా మార్గంలో నిధులు సేకరిస్తామా అన్న విషయాన్ని పక్కన పెడితే ఎలాగైనా దళితులకు సాయం చేసే పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలని పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఒకరి తర్వాత మరొకరు.. నెక్స్ట్‌ ఎవరు? ఏ ఆఫీసర్ చేతికి బేడీలు పడబోతున్నాయి?