ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అంటే ఒక్కప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. తెలుగుదేశం పార్టీకి దీటైన జవాబిచ్చి జిల్లాలో ఎదురులేని నాయకులుగా ఎదిగిన హేమాహేమి నాయకులు ఉండేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సైతం ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోరుగా ప్రచారం కూడా సాగింది. తీరా ఫలితాలు వచ్చేసరికి ఒకే సీటు సాధించగలిగింది.
ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన అత్రం సక్కు గెలిచిన కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన బడా లీడర్లంతా మౌనంగా ఉంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని హేమాహేమీలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల్‌కు చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి నిత్యం జనంలో ఉండే లీడర్ కూడా మౌనంగా ఉండడంతో కేడర్‌లో నిరుత్సాహం పెరిగిందంటున్నారు.
అటు పశ్చిమ జిల్లా ప్రాంతంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సి.రాంచంద్రారెడ్డి, గుండ్రాత్ సుజాత, రాథోడ్ రమేష్, భార్గవ్ దేశ్ పాండే లాంటి వారు పూర్తిగా మౌనంగా ఉంటున్నారట. ఇటు తూర్పు జిల్లా ప్రాంతంలో ప్రేమ్‌సాగర్ రావు, గడ్డం వినోద్, మరికొంత మంది సీనియర్ లీడర్స్ కూడా సైలెంట్‌గా ఉంటున్నారు. మొత్తం పది నియోజకవర్గాలలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి బలమైన లీడర్లే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కు ప్రచారంలో గట్టి పోటీ కూడా ఇచ్చారు. కానీ ప్రజలు మాత్రం అధికార పార్టీకే పట్టం కట్టడంతో పార్టీలోని హేమాహేమీలు డైలమాలో పడినట్లు కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారట.
రాబోయే ఎన్నికలు చాలా దూరంగా ఉన్నందునే మౌనంగా ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే జనంలో తిరిగి డబ్బులు ఖర్చు చేసుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క, సరైన కారణం లేకుండా ప్రతి ఇష్యూపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఉన్న సానుభూతి కూడా పోతుందనే ఉద్దేశంతో కూడా సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు. వీటన్నింటినీ పక్కనే పెడితే గ్రూప్ రాజకీయాలు కూడా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతల మౌనానికి ఒక రకంగా కారణంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వారు బీజేపీలోకి, టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడం, టికెట్ వచ్చిన వారు గ్రూప్ రాజకీయాల వల్లే ఓడిపోయామనే మనస్తాపంతో క్రియాశీల రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉండటం కూడా కారణం అంటున్నారు కార్యకర్తలు. దానికి తోడు నాలుగు జిల్లాలుగా ఏర్పడిన తర్వాత సమన్వయ లోపం పార్టీని వేధిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండటం, పార్టీలో కొనసాగాలా వద్దా అనే పరిస్థితిలో నేతలున్నారట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. కానీ, ప్రజల్లో ఉంటేనే పార్టీకి బలం పెరుగుతుందనే విషయాన్ని మరచిపోతున్నారని కార్యకర్తలు అంటున్నారు.