ADR Political Donations Report : రాజకీయ పార్టీల విరాళాల్లో భారీ మార్పులు.. బీఆర్ఎస్‌కు షాక్, వైసీపీకి పెరిగిన విరాళాలు.. టీడీపీకి తగ్గిన నిధులు..

ADR Political Donations Report : ఏడీఆర్ నివేదిక ప్రకారం.. రూ.20వేలకుపైగా ప్రకటించిన విరాళాల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా తగ్గుదల చోటు చేసుకుంది.

ADR Report 2024-25 political parties Donations

ADR Political Donations Report 2024-25 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీల రాజకీయ విరాళాల లెక్కలు ఆసక్తికర చిత్రాన్ని చూపిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్‌కు విరాళాలు భారీగా తగ్గగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం విరాళాల ప్రవాహం గణనీయంగా పెరిగింది. టీడీపీ విరాళాల్లో స్వల్ప తగ్గుదల నమోదవగా, ఎంఐఎం రూ.20 వేలకుపైగా ఒక్క విరాళాన్నీ ప్రకటించలేదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

Als0 Read : Liquor Price Hike : మందు బాబులకు బిగ్ అలర్ట్.. మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయ్.. కారణాలివే? ఎంత శాతం పెరుగుతాయంటే?

ఏడీఆర్ నివేదిక ప్రకారం.. రూ.20వేలకుపైగా ప్రకటించిన విరాళాల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. 2024-25లో బీఆర్ఎస్‌కు రూ.20 వేలకుపైగా విలువైన కేవలం నాలుగు విరాళాల రూపంలో రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి. 2023-24లో మాత్రం ఎనిమిది విరాళాల ద్వారా రూ.85 కోట్లు అందాయి. దీంతో ఒక్క ఏడాదిలోనే రూ.70 కోట్ల తగ్గుదల నమోదైంది. ఇక ఎంఐఎం 2024-25లో రూ.20 వేలకుపైగా ఒక్క విరాళాన్నీ ప్రకటించలేదు. 2023-24లో మాత్రం 16 విరాళాల ద్వారా రూ.9 లక్షలు ప్రకటించింది.

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024-25లో 37 విరాళాల ద్వారా రూ.140 కోట్లు ప్రకటించింది. 2023-24లో కేవలం నాలుగు విరాళాల ద్వారా రూ.62.5 కోట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో, ఈసారి రూ.77.5 కోట్ల పెరుగుదల నమోదైంది. ఆ పార్టీకి వచ్చిన నిధుల్లో అత్యధిక భాగం కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వర్గాల నుంచే వచ్చింది. ఇతర వర్గాల నుంచి వచ్చిన విరాళాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఇదిలాఉంటే.. 2024-25లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అన్ని విరాళాలు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారానే అందాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో తమ మొత్తం విరాళాలను పూర్తిగా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారానే స్వీకరించిన ఏకైక పార్టీగా వైఎస్సార్‌సీపీ నిలిచింది.

2023-24లో ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు ప్రకటించిన టీడీపీ.. 2024-25లో విరాళాలు 17.1 శాతంకు తగ్గాయి. గత ఏడాది 172 విరాళాల ద్వారా రూ.100 కోట్లు అందుకోగా, ఈసారి 267 విరాళాల ద్వారా రూ.83 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రూ.17 కోట్ల తగ్గుదల నమోదైంది. అయితే రెండు ఆర్థిక సంవత్సరాలను కలిపి చూస్తే, టీడీపీకి కార్పొరేట్ సంస్థల నుంచి రూ.116 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.66.6 కోట్లు అందాయి. ఇక జనసేన పార్టీకి 2023-24లో విరాళాల ద్వారా రూ.36కోట్లు రాగా.. 2024-25లో రూ.25కోట్లు వచ్చాయని ఏడీఆర్ పేర్కొంది.

దేశంలోని 40 ప్రాంతీయ పార్టీలకు 2024-25లో రూ.1,051.55 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్‌ సంస్థ పేర్కొంది. అయితే, ప్రాంతీయ పార్టీలకు సంబంధించి 2024-25లో రూ.20వేల కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలను పరిశీలిస్తే.. 2024-25లో రూ.365.78 కోట్ల విరాళాలతో డీఎంకే మొదటిస్థానంలో నిలిచింది. తృణమూల్ కాంగ్రెస్ రూ.184.96 కోట్లతో రెండో స్థానంలో, రూ. 140 కోట్లతో వైసీపీ మూడో స్థానంలో, రూ.83కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రూ.66 కోట్లతో అన్నాడీఎంకే ఐదో స్థానంలో నిలిచింది. 2024-25 నాటికి కేవలం నాలుగు విరాళాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ కేవలం రూ. 15కోట్లను మాత్రమే స్వీకరించింది.