ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాలను తయారు చేసే వరంగల్ నగరంలోని హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి.
చికెన్-65.. గోంగూర మటన్.. రొయ్యల ఫ్రై, చేపల పులుసు .. ఆహా… హోటళ్లలో మెనూ చూస్తే నోరూరాల్సిందే…. వేడి వేడిగా వడ్డిస్తుంటే లొట్టలేయాల్సిందే.. కలర్‌ఫుల్‌గా అలంకరించిన వంటకాలను చూస్తే మాంసం ప్రియుల మనస్సు లాగేయాల్సిందే.. అయితే ఆ ఆహారాన్ని తీసుకున్నామా.. ఆరోగ్యం హాంఫటే. రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్స్‌లోనే కాదు పెద్దపెద్ద అద్దాల భవంతుల్లో నిర్వహిస్తున్న ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనూ ప్రమాణాలు పాటించడం లేదు. వినియోగదారుడి ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. కాకతీయుల ఖిల్లా అయిన వరంగల్‌లో ఇప్పుడు నాణ్యత లేని ఆహారం.. ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తోంది.
బిజీగా మారిన నగర జీవితంలో భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే కానీ బతికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇంటి వంట కంటే బయటి ఆహారంపైనే కొన్ని కుటుంబాలు ఆధార పడుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం వరంగల్ నగర ప్రజలు, టూరిస్టులు, వివిధ పనుల కోసం వరంగల్ ప్రాంతానికి వచ్చే దాదాపు 50 శాతం మంది నిత్యం ఏదో ఒక సమయంలో హోటల్ భోజనంపైనే ఆధారపడుతున్నారు. రోడ్డు పక్కనుండే బజ్జీల బండి నుంచి త్రీ, ఫైవ్, సెవన్ స్టార్ హోటళ్ల వరకు ఆర్థిక స్థోమతను బట్టి నచ్చింది ఆరగించేస్తున్నారు. పక్కా వెజ్ నుంచి వివిధ రకాల నాన్‌వెజ్ వరకు.. ఏ ఆహారానైనా ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అంటూ హోటళ్లలో తినే వారెందరో. బయటి ఆహారం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా… జిహ్వాచాపల్యం ఆ ప్రమాదాన్ని గుర్తించకుండా చేస్తోంది.
ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాలను తయారు చేసే వరంగల్ నగరంలోని హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి పనికిరాని మాంసాన్ని వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని పలు హోటళ్లలో మాంసంగా వినియోగించేందుకు వీల్లేని రోగాలతో కూడిన గొర్రెలు, పశువుల మాంసాన్ని వంటకాల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మాంసాహార పదార్థాలు హానికరంగా మారుతున్నాయి. వారం, పది రోజులు నిల్వ ఉన్న మాంసాన్ని బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఇటీవల జరిపిన తనిఖీల్లో.. బిర్యానీ తయారీకి వినియోగించే మాంసం కుళ్లి దుర్వాసన వస్తోంది. సాధారణ హోటళ్లే కాదు.. స్థాయి పేరు ప్రఖ్యాతులున్న సంస్థలు విక్రయించే ఆహారంలోనూ సాల్మోనెల్లా, ఈ-కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని శాస్త్రీయంగా నిర్ధారణ అవుతోంది.
హన్మకొండ నక్కలగుట్టలోని ల్యాండ్ మార్క్, సుబేదారిలోని గ్రీన్ పార్క్ హోటల్, రత్న గ్రాండ్ హోటల్ లో పాటు మాస్టర్ చెఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. దీంతో అనేక విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాసులకు కక్కుర్తి పడుతున్న హోటళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. లాభాపేక్షతో ఉన్న యజమానులు కొందరు చెడిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. కుళ్లిన మాంసానికి కలర్లు అద్ది వేడి వేడిగా అందిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకొని కొందరు హోటళ్ల యజమానులు వారాల తరబడి నిల్వచేసిన మాంసాన్ని విక్రయిస్తున్నారు.
హోటళ్లలోకి వెళ్లిన అధికార బృందానికి కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు కనిపించాయి. హోటళ్లలో కిలోల కొద్ది పొట్టేలు, కోడి మాంసం, రొయ్యలు, చేప మాంసం నిల్వ చేసి ఉంది. కవర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని తెరవగానే దుర్వాసన ముక్కులు మూసుకునేలా చేసింది. చేపల నుంచి కుళ్లిన నీరు ధారలా పారింది. అక్కడే మసాలలో ముంచి రెండు మూడు రోజుల క్రితం నుంచి నిల్వ చేసిన మాంసం, మాంసాన్ని బకెట్‌లలో నిల్వ చేసి ఉంచారు. వారాల తరబడి ఫ్రీజర్లలో నిల్వ ఉండటంతో అప్పటికే మాంసం మురిగిపోయింది.
రుచి పేరిట రసాయనాలతో కూడిన వస్తువులు వినియోగించడం.. అల్సర్, అధిక బరువు, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు దారి తీస్తున్నాయి. రసాయనాలున్న ఆహారం తింటే కేన్సర్ సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటిలో శుద్ధి చేసిన మాంసాన్ని 12 గంటల లోపు వినియోగించాలి. పాకెట్లలో నిల్వ చేసిన మాంసం విక్రయానికి FSSI ధ్రువీకరణ తప్పనిసరి. కాని ఇవి ఎక్కడా అమలు కావడం లేదు.
వరంగల్ నగరంలోని కాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరంలోని ప్రముఖ హోటళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటాన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ చాలా సీరియస్ గా తీసుకున్నప్పటికీ అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. వరంగల్ లోని ఖుర్షిద్ హోటల్, హన్మకొండలోని ల్యాండ్ మార్క్, సుబేదారిలోని గ్రీన్ పార్క్ హోటల్, రత్న గ్రాండ్ హోటల్, మాస్టర్ చెఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటి ప్రముఖ హోటళ్లలో డొల్లతనం బయట పడింది. నిషేదిత ప్లాష్టిక్ ను కూడా బడా హోటళ్లు వాడుతూ పర్యావరణ, ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. హన్మకొండలోని ల్యాండ్ మార్క్, రత్నా గ్రాండ్, ఖుర్షిద్, లాంటి హోటళ్లు పేరుగాంచినవే అయినా ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రమాణాలు పాటించని హోటల్స్‌కు వేల రూపాయల ఫైన్లు వేశారు అధికారులు.
అయితే హెల్త్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌గా తనిఖీలు చేయకపోవడం వల్లనే హోటల్స్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు. దాడులు చేసినప్పుడు తూతూ మంత్రంగా జరిమానాలు విధించి ఊరుకోకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా హోటల్స్ యజమానులు సరైన ప్రమాణాలు పాటించడం లేదంటున్నారు హెల్త్ డిపార్ట్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరింత కఠినంగా వ్యవహరించి వరంగల్ నగరంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తామని MHO రాజారెడ్డి తెలిపారు.