మూడు పార్టీలకు సవాల్‌గా మారిన ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు.. నాలుగో అభ్యర్థిగా బరిలోకి లంబాడా నేత!

మూడు పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా.. తమ వర్గానికి చెందిన నేతను నాలుగో అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Adilabad Lok Sabha Constituency: ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు ఈసారి అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. ఆదివాసీ, లంబాడాల వైరం ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఆందోళనలో ఉన్నాయి పార్టీలు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడుపార్టీలు ఆదివాసీ అభ్యర్థులనే బరిలోకి దించాయి. తమవర్గానికి ఏ పార్టీ సీటు ఇవ్వకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు లంబాడాలు.

మూడు పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా.. తమ వర్గానికి చెందిన నేతను నాలుగో అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీఎంపీ రాథోడ్ రమేష్ తో పాటు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ నుంచి రమేష్ రాథోడ్, కాంగ్రెస్ నుంచి రేఖానాయక్ చివరివరకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ ఇద్దరికి ఆ రెండు పార్టీల్లో టికెట్ దక్కకపోవడంతో లంబాడా సామాజిక వర్గం అభ్యర్థి బరిలో లేకుండాపోయారు.

ఓటరు జాబితా ప్రకారం ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 2 లక్షల పైచిలుకు ఆదివాసీ ఓటర్లు ఉన్నారు. అటు లంబాడాలకు లక్షా 48వేల ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడు పార్టీల అభ్యర్థుల్లో ఆదివాసీ ఓట్లు డివైడ్ అయితే.. తమ అభ్యర్థికి వన్ సైడ్‌గా ఓట్లు పడే అవకాశం ఉందంటున్నారు లంబాడా జేఏసీ నేతలు. ఎంపీగా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజల్లో ఆయనపై ఉన్న సానుభూతి కలిసి వస్తుందని రమేష్ రాథోడ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హాట్ కామెంట్స్

ఐదారేళ్ల క్రితం లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఆదివాసీ ఉద్యమం తీవ్రతరం కావడంతో ఎస్టీ తెగల్లోని ఈ రెండువర్గాల్లో తీవ్ర గ్యాప్ ఏర్పడింది. అసలు లంబాడాలు ఎస్టీనే కాదన్న వాదనను గట్టిగా వినిపిస్తున్నారు ఆదివాసీ నేతలు. ఆదివాసీ, లంబడాల మధ్య నేటికీ నువ్వానేనా అన్నట్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు.. మరోసారి రెండు వర్గాల మధ్య పొలిటికల్ చిచ్చు రేపుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు