Hanuman Shobha Yatra: హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధం.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా 3వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలని కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నారు.

  • Published On : April 1, 2026 / 06:07 PM IST

 

Hanuman Shobha Yatra: హనుమాన్ శోభాయాత్రకు హైదరాబాద్ ముస్తాబైంది. రేపు భాగ్యనగరం వీధులు జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లనున్నాయి. సిటీలో మొత్తం 168 శోభాయాత్రలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీసులు పూర్తి ఏర్పాట్లు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భారీగా హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నందున ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ఈసారి ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా 3వేల మంది పోలీస్ సిబ్బందితో పాటు అదనపు సాయుధ బలగాలు, టాస్క్ ఫోర్స్ బృందాలని కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. మొత్తం 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర జరగనుంది. గౌలిగూడ రామమందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు యాత్ర జరగనుంది. యాత్ర నిర్ణీత మార్గాల్లోనే సాగేలా చూడాలని, కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు..

హనుమాన్ జయంతి శోభా యాత్ర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ​ప్రధాన శోభా యాత్ర ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామమందిర్ నుండి ప్రారంభమై రాత్రి 8 గంటలకు తాడ్ బండ్ హనుమాన్ దేవాలయానికి చేరుకుంటుంది. ఈ యాత్ర సుమారు 12 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇందులో 2 కిలోమీటర్ల మేర మల్కాజ్ గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది.
​కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం వంటి వివిధ ప్రాంతాల నుండి 14 ఉపయాత్రలు ప్రధాన ర్యాలీలో కలుస్తాయి. ఇవి కాకుండా కమిషనరేట్ వ్యాప్తంగా మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి.

​ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు:
* ​యాత్ర సాగే సమయంలో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించడం లేదా మళ్లించడం జరుగుతుంది.
* ​భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, సరుకు రవాణ వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు.
* ​ఊరేగింపు సాగే మార్గాల్లో ఎటువంటి పార్కింగ్‌ను అనుమతించరు
* నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు టోయింగ్

​రద్దీ ఉండే అవకాశం ఉన్న ముఖ్య ప్రాంతాలు:
CTO-తాడ్ బండ్ దేవాలయం
మల్కాజ్ గిరి-ఆనంద్‌బాగ్ రోడ్
సఫిల్‌గూడ- నేరెడ్‌మెట్
ECIL – AS రావు నగర్
సైనిక్‌పురి-యాప్రాల్, హస్మత్‌ పేట్
తార్నాక – హబ్సిగూడ మార్గాలు
కర్మన్‌ఘాట్ దేవాలయం
NGO’s కాలనీ నుండి LB నగర్ వరకు ఉన్న రహదారులపై రద్దీ ఎక్కువగా ఉంటుంది.

​భక్తుల కోసం పార్కింగ్ స్థలాలు (తాడ్ బండ్ దగ్గర):​
ధోబీ ఘాట్.
​హనుమంత రెడ్డి కాంప్లెక్స్, తాడ్ బండ్ ఎక్స్ రోడ్స్.
​ఇంపీరియల్ గార్డెన్స్ ముందున్న ఖాళీ స్థలం, కార్ఖానా.

​ప్రజలకు విన్నపం:
ప్రజలు ఊరేగింపు సమయాలను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, తమకు సహకరించాలని పోలీసులు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112 కి కాల్ చేయాలన్నారు. లేదా మల్కాజ్ గిరి ట్రాఫిక్ హెల్ప్‌ లైన్ నెంబర్లు 8712662999, 8712662850 ను సంప్రదించాలని సూచించారు.

Also Read: చైత్ర పౌర్ణమి+హనుమాన్ జయంతి.. ఈ పని చేస్తే..