Municipal Elections Representative Image (Image Credit To Original Source)
Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నడుస్తోంది. పురపాలక ఎన్నికల ద్వారా తిరిగి పుంజుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి జనసేనతో కలిసి ముందుకెళ్తోంది.
అయితే కొన్నిచోట్ల పార్టీల పొత్తులు చర్చనీయాంశంగా మారాయి. పొత్తులు..సిద్ధాంతాలతో సంబంధం లేకుండా..లోకల్ ఈక్వేషన్లో భాగంగా గేమ్ మార్చేశాయి పార్టీలు. ఇక్కడ మాకు..అక్కడ మీకు అంటూ అంతర్గత ఒప్పందాలు చేసుకుని ప్రత్యర్థిపై పైచేయి సాధించే ఎత్తులు వేస్తున్నాయి. అయితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫెవికాల్ లాంటి విడదీయలేని బంధం ఉందని, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని బీజేపీ అటాక్ చేస్తోంది. ఇక రెండు జాతీయ పార్టీలు ములాఖత్ పాలిటిక్స్ చేస్తున్నాయని గులాబీ లీడర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా అధికారికంగా మరొక పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ప్రతి పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి, ప్రత్యర్థి పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయంటూ అలిగేషన్స్ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే స్కెచ్ వేస్తున్నాయి.
Also Read: Congress: తగ్గని జీవన్‌రెడ్డి.. అసంతృప్తిలో సరితా తిరుపతయ్య
మున్సిపల్ ఎన్నికల్లో అంతర్గత పొత్తులు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుతో పోటీచేయగా.. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పలుచోట్ల డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్‌తో జతకట్టారు సీపీఐ నేతలు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.
చెన్నూర్‌లో బీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు
ఇక చెన్నూర్‌లో బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించింది సీపీఐ. అయితే తమ పార్టీ పొత్తు ధర్మాన్ని వదిలి కమ్యూనిస్టులు మంచిర్యాల జిల్లాలో కారుతో షికారు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇక కొత్తగూడెంలో కమ్యూనిస్టులు కత్తులు దూసుకుంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం పురపోరు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీపీఎంతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్తుండగా..సీపీఐ, టీడీపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో సీపీఐ, తెలుగుదేశం పార్టీతో కలిసి బరిలోకి దిగాయి. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్‌తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, స్థానికంగా సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు సీపీఐ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోయినా, సీఎంకు, మంత్రులకు తాము వ్యతిరేకం కాదని కూనంనేని పదేపదే క్లారిటీ ఇస్తున్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, కార్యకర్తల ఆకాంక్షల మేరకే విడిగా పోటీ చేస్తున్నామంటున్నారు.
కాంగ్రెస్‌తో గిట్టక కమ్యూనిస్టులు తలోదారిలో..
మున్సిపల్ ఎన్నికల్లో లోకల్ లీడర్ల ఆకాంక్షలు.. స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో గిట్టక కమ్యూనిస్టులు తలోదారిలో వెళ్తున్నారు. అయితే మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నాటికి సీన్ ఎలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు పోటీ చేస్తున్నట్లుగా ఎవరికో ఒకరికి మెజార్టీ సీట్లు వస్తే మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సాఫీగా జరిగిపోవచ్చు.
కానీ మ్యాజిక్ ఫిగర్‌కు తక్కువ సీట్లు వస్తే.. అప్పుడు ఎవరు ఎవరితో జట్టు కడుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ నేతలు..మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో తమ మద్దతు కీలకమైతే అప్పుడు ఎవరివైపు ఉంటారన్నది ఆసక్తి రేపుతోంది.కొత్తగూడెంలో లోకల్ ఈక్వేషన్స్ తేడా కొట్టి సీపీఐ, సీపీఎంలు తలోదారిని ఎంచుకున్నాయి.
మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా సీట్లు రాకపోతే కమ్యూనిస్టులు మద్దతు కోరొచ్చు. రాష్ట్ర నాయకత్వం ఆదేశిస్తే కాంగ్రెస్‌కు మద్దతుకు తెలుపుతారో..లేక లోకల్ ఈక్వేషన్స్..ఎమోషన్స్‌కు కట్టుబడి ఇప్పుడున్న పొత్తుల ప్రకారమే ముందుకు వెళ్తారో..13 తారీఖు తర్వాత తేలిపోనుంది. సేమ్‌టైమ్ మున్సిపల్ ఎన్నికల పొత్తుల ఈక్వేషన్స్..రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ఎన్ని మలుపులు తీసుకుంటాయోనన్నది కూడా ఇప్పుడే ఓ అంచనాకు రాలేని పరిస్థితి.