Congress: తగ్గని జీవన్‌రెడ్డి.. అసంతృప్తిలో సరితా తిరుపతయ్య
జీవన్ రెడ్డి తనకిచ్చిన 20 స్థానాలతో పాటు.. మిగతా చోట్ల ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న తన అనుచరుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
Jeevan Reddy
- మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్
- ఈ సమయంలో జగిత్యాల, గద్వాల్లో రచ్చ
- జీవన్‌రెడ్డి, సరితా తిరుపతయ్య తీరుతో బేజారు
Congress: మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉంది. ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా..వెంటనే అలర్ట్ అవుతున్నారు పార్టీ పెద్దలు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను నేరుగా ఫాలో అప్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీఫామ్‌తో పోటీ చేస్తున్న ప్రతీ ఒక్కరూ గెలవాలని..ఆ దిశగా అనేక ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే మొదటి నుంచి జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో హస్తం పార్టీకి తలనొప్పులు ఉండేవి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు వరకు అన్ని చోట్ల కొత్త, పాతల పంచాయితీని మ్యాగ్జిమమ్ సెట్ చేశారు కాంగ్రెస్ పెద్దలు. జగిత్యాల, గద్వాల్లో మాత్రం అటు జీవన్‌రెడ్డి..ఇటు సరితా తిరుపతయ్య ఎంతకు తగ్గకపోవడంతో..ఇప్పటికీ రచ్చ నడుస్తూనే ఉంది. దీంతో ఆ రెండు చోట్ల హస్తం పార్టీకి కొరకరాని కొయ్యలా మారాయి పరిస్థితులు.
జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్‌గా పార్టీ బీఫామ్‌లు మొత్తం తన వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో 50 వార్డులు ఉంటే..ఇందులో 30 స్థానాలు ఎమ్మెల్యే సంజయ్‌కి..మిగిలిన 20 జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చారు. దీంతో జీవన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
Also Read: BJP: ఏపీ బీజేపీ నేతలు స్పీడు ఎందుకు పెంచట్లేదు?
తన ముఖ్య అనుచరులున్న చోట కూడా బీ-ఫామ్ ఇవ్వలేదని పార్టీ తీరుపై సీరియస్ అయ్యారు. తర్వాత జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. మరోవైపు పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సంజయ్ 30 సీట్లకే పరిమితమై..అక్కడి వరకే ప్రచారం చేసుకుంటున్నారు.
అనుచరుల గెలుపు కోసం ప్రచారం
జీవన్ రెడ్డి మాత్రం తనకిచ్చిన 20 స్థానాలతో పాటు.. మిగతా చోట్ల ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్న తన అనుచరుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా దొంగలు పడి హస్తం గుర్తును ఎత్తుకుపోయారంటూ గళం ఎత్తుతున్నారు. జీవన్‌రెడ్డి అసమ్మతితో జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని..కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందట.
మరోవైపు గద్వాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. గద్వాల్లో మొత్తం 37 డివిజన్లు ఉంటే..మొదట్లో 20 ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వర్గానికి..మిగతా 17 ఇంచార్జ్ సరితా తిరుపతయ్యకు కేటాయించాలనుకున్నారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ఎమ్మెల్యే వర్గానికి 30..సరితా వర్గానికి ఏడు అని ఒప్పందం చేసుకున్నారు.
నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన
చివరకు 37కు 37 బీఫామ్‌లు మొత్తం ఎమ్మెల్యే వర్గానికి ఇచ్చేయడంతో..సరితా తిరుపతయ్య వర్గం సీరియస్‌గా రియాక్ట్ అవుతుంది. నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వర్గానికి ఏడు స్థానాలు ఇచ్చినట్లే ఇచ్చి హ్యాండ్ ఇవ్వడంపై మనస్థాపం చెందారట. తన వర్గం నుంచి బరిలో నిలిచిన ఏడుగురు నేతల కోసం స్వయంగా ప్రచారం చేస్తూ..గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా..సరితా వెనక్కి తగ్గడం లేదట. పార్టీ సింబల్‌పై పోటీ చేస్తున్న అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆమెపై రాష్ట్ర పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఇలా రెండుచోట్ల జీవన్ రెడ్డి, సరితా తిరుపతయ్య..సొంత పార్టీ అభ్యర్థులపై ఇండిపెండెంట్లను బరిలోకి దించడం..వారి తరఫున ప్రచారం కూడా చేస్తుండటాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుందట. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో పనిచేస్తుంటే..వీరిద్దరు గండీ కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
ఇలా పార్టీ లైన్‌కు విరుద్ధంగా నడుచుకుంటున్న ఆ ఇద్దరి తీరును ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోయేది లేదని రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇస్తోందట. త్వరలో వీరిద్దరికి పార్టీ క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. లేదంటే ఎన్నికల్లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. జీవన్ రెడ్డి, సరితా తిరుపతయ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందో వేచి చూడాలి మరి.
