BJP: ఏపీ బీజేపీ నేతలు స్పీడు ఎందుకు పెంచట్లేదు?
త్వరలోనే స్థానిక, మున్సిపోల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక, పురపోరు కోసం పార్టీని సన్నద్ధం చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
AP BJP Leaders
- ఏపీలో కమలం దూకుడేది.? లీడర్ల మౌనమెందుకు?
- కేంద్రంలో అధికారం.. రాష్ట్రంలో కీరోల్.. జోష్ ఏది?
- పీవీఎన్ మాధవ్‌కు సీనియర్ నేతల సహకారం అందట్లేదా?
BJP: నార్త్‌లో స్ట్రాంగ్ బేస్. సౌత్‌లోనూ అంతో ఇంతో పట్టు పెంచుకుంటూ వస్తోంది బీజేపీ. దక్షిణాదిలో ఏపీలో మాత్రమే బీజేపీకి చెప్పుకోదగ్గ స్రెంథ్ లేదు. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా వచ్చే సీన్ లేదు. అందుకే కూటమిలో భాగంగా ఉంటూనే..నవ్యాంధ్రలో కమల వికాసం కోసం ఎత్తులు వేస్తున్నారు కమలనాథులు.
ఇప్పటికంటే ఇంకింత బలంగా..మరింత స్ట్రాంగ్‌గా నిలబడేందుకు సరికొత్త స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. అందుకే ఓ చేతిలో బీజేపీ జెండా..ఇంకో చేతిలో కూటమి అజెండాతో..కలిసి నడుద్దామ్. పార్టీ కోసం కష్టపడుదామంటూ ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పిలుస్తున్నారు. కానీ సీనియర్ లీడర్లలో మాత్రం ఆ దూకుడు కనిపించట్లేదట.
అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు దూసుకెళ్తున్న స్పీడుగా..కమలనాథులు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారట. దీంతో ఏపీలో బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ యాక్టీవ్‌గానే ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. అధికార కూటమి కీలకంగా ఉన్న టీడీపీ..మళ్లీ పవర్లోకి రావాలని ఎత్తులు వేస్తున్న వైసీపీ..ఎక్కడా తగ్గట్లేదు. రేపే ఎలక్షన్స్ ఉన్నాయన్నట్లుగా ఆ రెండు పార్టీలు ఎప్పుడూ సూపర్ యాక్టీవ్‌గా ఉంటున్నాయి.
Also Read: వాటి గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జనసేన కూడా అటు పార్టీ నిర్మాణంలోనూ ఇటు పొలిటికల్గాను దూకుడు మీదుంది. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా ఏదొక హడావుడి చేస్తూనే ఉంటుంది. పార్టీకి క్యాడర్, లీడర్లు లేకపోయినా షర్మిల చేసే పొలిటికల్ కామెంట్స్ నిత్యం ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. కానీ ఏపీలో బీజేపీ మాత్రం అంత యాక్టీవ్‌గా కనిపించట్లేదన్న చర్చ ఉంది.
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలేవి?
ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉన్నా అటు ప్రభుత్వంలోనూ ఇటు పొలిటికల్ గాను పార్టీ యాక్టివిటీ చాలా తక్కువ. ఇక పార్టీ బలోపేతం కోసం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బలమైన ప్రయత్నాలేమి జరగడం లేదని కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. దీనికి కారణం బీజేపీ కీలక నేతలు సైలెంట్ మోడ్‌లో ఉండటమే అంటున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉంటూ..చాలా రాష్ట్రాల్లో పవర్లో కొనసాగుతూ..ఏపీ ప్రభుత్వంలో కీరోల్ ప్లే చేస్తున్నప్పటికీ..ఏపీలో మాత్రం ఆశించినంతగా కమలం లీడర్లు దూకుడు ప్రదర్శించడం లేదంటున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో బీజేపీ లీడర్లు అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పుకుంటూ..అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ను ఢీకొడుతూ ముందుకెళ్తుంటే..ఏపీ బీజేపీ లీడర్లు పార్టీని గాలికి వదిలేశారని క్యాడర్ బాణాలు ఎక్కుపెడుతోంది.
ఏపీలో బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి ఉన్నారు. ఏపీ నుంచి గెలిచిన ముగ్గురు బీజేపీ ఎంపీల్లో భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్రమంత్రిగా ఉన్నారు. వీరికి తోడు పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. వీరెవరూ పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక చొరవ చూపట్లేదని కార్యకర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా ఎలాంటి యాక్టీవిటీ చేపట్టకపోవడంతో పాటు..పొలిటికల్ ఇష్యూస్‌పై కూడా ఒక్కరూ నోరెత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. లీడర్లే సైలెంట్ మోడ్‌లో ఉండటంతో ఏపీ బీజేపీపై ప్రజల్లో చర్చకే ఆస్కారం లేకుండా పోయిందంటున్నారు. అధ్యక్షుడిగా మాధవ్ ఉన్నప్పటికీ ఆయన వాయిస్ పెద్దగా ప్రజలోకి వెళ్లడం లేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ.
మాధవ్ కొత్తగా చేస్తున్నదేమీ లేదా?
జాతీయ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నిర్వహించడం తప్ప.. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం కోసం, క్యాడర్ బలోపేతం కోసం అధ్యక్షుడిగా మాధవ్ కొత్తగా చేస్తున్నదేమి లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధ్యక్షుడు చేపడుతున్న కొద్దిపాటి యాక్టివిటీకి కూడా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి కోఆపరేషన్ లేదని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు తెచ్చుకోవడం తప్ప..ఒక్క సీటు కూడా గెల్వలేకపోయింది బీజేపీ. 2024కు వచ్చే సరికి కూటమిగా జత కట్టి..అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లో ఏపీ నుంచి ప్రాతినిధ్యం దక్కించుకుంది.
ఇలాంటి పరిస్థితుల్లో మెల్లగా పార్టీని బలోపేతం చేసుకుంటూ పోతే చట్టసభల్లో తమ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలేమి లేవంటున్నారు కార్యకర్తలు. త్వరలోనే స్థానిక, మున్సిపోల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక, పురపోరు కోసం పార్టీని సన్నద్ధం చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారంతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలు..నేతలు..ఏపీ బీజేపీ నేతల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న పరిస్థితి. కూటమిలో టీడీపీ, జనసేన తమ పార్టీలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంటే బీజేపీ లీడర్లు మాత్రం పార్టీని పట్టించుకోవడమే మానేశారన్న విమర్శలు కమలం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.
