Gold Donation : అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి రూ. 2.20 కోట్ల బంగారు విరాళంపై AMR ఇండియా లిమిటెడ్ అధికారిక ప్రకటన
Gold Donation : ఈ బంగారు ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్ సంస్థ తయారు చేసింది. సంబంధిత బిల్లులు ఆలయ అధికారులకు అందజేశారు. భక్తులు, ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి. సుబ్బరామిరెడ్డి అధికారిక ప్రకటనలో తెలిపారు.
- Sreehari A
- Updated on- June 1, 2026 / 11:39 AM IST
Amr India Limited Announces Gold Donation Worth Rs 2 20 Crore To Anjanadri Hanuman
- ఆభరణాలలో 1 కిలో 280 గ్రాముల బంగారం వినియోగం
- 300 గ్రాములే వినియోగించారన్న ప్రచారం అసత్యం
- ఆభరణాల విలువ రూ. 2.20 కోట్లుగా నిర్ధారణ
- మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి
- ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి. సుబ్బరామిరెడ్డి అధికారిక ప్రకటన
Gold Donation : హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఎ. మహేష్ రెడ్డి కర్నాటక రాష్ట్రం కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలోని అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి విరాళంగా అందించిన ఆభరణాల్లో 1 కిలో 280 గ్రాముల బంగారం వినియోగించినట్టు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి. సుబ్బరామిరెడ్డి తెలిపారు.
ఈ ఆభరణాల విలువ దాదాపు రూ. 2.20 కోట్లుగా ఉందన్నారు. కేవలం 250–300 గ్రాముల బంగారం మాత్రమే ఉపయోగించారన్న వార్తలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన బిల్లులు, ఆధార పత్రాలు ఆలయ అధికారులకు ఇప్పటికే సమర్పించామని చెప్పారు.
బంగారం విలువ దాదాపు రూ. 2.2 కోట్లు :
2026 మే 8న ఏఎంఆర్ సంస్థ చైర్మన్ ఎ. మహేష్ కుమార్ రెడ్డి అంజనాద్రి దేవస్థానానికి కిరీటం, మకరతోరణం, గద, ఛత్రి, సూర్య చంద్ర, గరుడ హనుమ జెండా సహా మొత్తం 12 బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు. వీటికి 1 కిలో 280 గ్రాముల బంగారం వినియోగించారు. వీటి విలువ దాదాపు రూ. 2.2 కోట్లుగా ఉంటుందని అధికారిక ప్రకటనలో బి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు.
300 గ్రాములేనంటూ తప్పు ప్రచారం :
అయితే, అవగాహన లోపంతో కేవలం 300 గ్రాములే ఉపయోగించారంటూ తప్పుదారి పట్టించేలా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, షిర్డీ సాయి బాబా వంటి ప్రసిద్ధ దేవాలయాలకు కూడా దాతలు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు అందించారని గుర్తుచేశారు. కోట్ల విరాళమిచ్చిన దాతలపై ఇలాంటి అసత్య ప్రచారం జరగడం చాలా బాధకరమన్నారు.
ఈ బంగారు ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్ సంస్థ తయారు చేసింది. సంబంధిత బిల్లులు ఆలయ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. భక్తులు, ప్రజలు అసత్య ప్రచారాలను అసలు నమ్మొద్దని తెలిపారు.
amr gold donation
హైదరాబాద్‌కు చెందిన టిబరుమల్ జ్యువెలరీ సంస్థ ఇన్వాయిస్ ప్రకారం.. ఆభరణాల వాల్యూ రూ.2,20,42,000గా నిర్ధారించినట్టు తెలిపారు. దేవునికి భక్తితో సమర్పించిన పవిత్ర ఆభరణాల విషయమై ప్రజలు వాస్తవాలను గమనించాలన్నారు.
తయారీ సంస్థ జ్యుడీషియల్ బాండ్ వివరాలు :
ఆభరణాల తయారీ కోసం ఏఎంఆర్ చైర్మన్ మహేష్ రెడ్డి 1400 గ్రాముల (1.4 కిలోలు) బంగారం అందజేశారు. ఈ బంగారంతో 12 రకాల ఆభరణాలను తయారు చేశారు. తరుగుపోయిన తర్వాత నికర బరువు 1 కిలో 280 గ్రాములు వచ్చింది. ఈ బంగారు ఆభరణాలకు 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తున్నామని జ్యుడీషియల్ బాండ్ వివరాల్లో తయారీ సంస్థ పేర్కొంది.
మీడియాకు విజ్ఞప్తి :
వాస్తవాలు తెలుసుకుని మాత్రమే వార్తలను ప్రచురించాలని మీడియా సంస్థలను ఆయన కోరారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బి. సుబ్బరామిరెడ్డి హెచ్చరించారు.
