Telangana Govt : మహిళల కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వచ్చే నెల నుంచి వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు
Telangana Govt : రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Telangana Govt Key decision single women pension scheme Coming into effect from July
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- వచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు
- వెల్లడించిన మంత్రి సీతక్క
Telangana Govt : రాష్ట్రంలోని ఒంటరి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి ఒంటరి మహిళలకు పింఛన్లు అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ప్రకటించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళ ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు గత ఏడాదిలో రూ.61వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించడంతోపాటు.. రూ.14కోట్ల వడ్డీ భారం ప్రభుత్వమే భరించిందని తెలిపారు.
మహిళలు ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో పర్యాటకం, ఆహార ఉత్పత్తులు, చేతివృత్తులు, సేవారంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయని, మహిళలు వాటిని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం వివిధ కేటగిరీల కింద 42లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా.. వారిలో నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు పొందుతున్న వారు 19,04,239 మంది ఉన్నారు. అయితే, కేవలం అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రక్షాళన మొదలు పెట్టింది. లబ్ధిదారుల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు, నిధుల దుర్వినియోగం అవుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లలో అనర్హులను ఏరివేసేందుకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సర్వే చేపట్టింది. ఈ క్రమంలో దాదాపు 93వేల మందికిపైగా అనర్హులను గుర్తించినట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి అనర్హులను తొలగించి అర్హులకే పెన్షన్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
