టీడీపీలో పెద్ద పొజిషన్‌కే ఎసరుపెట్టిన అనగాని

టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌.. ఏపికి చెందిన వ్యక్తే. చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చి పోతూ ఉంటారు. తెలంగాణ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలున్న ఆయన.. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినా ఆయన మాత్రం గెలిచారు. అప్పటి నుంచి పక్క పార్టీ మీదే చూపు. రేపో మాపో పార్టీ మారతారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. వీటన్నిటినీ కొట్టిపారేస్తూ తాను పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు సత్యప్రసాద్‌.

ఒకసారి బీజేపీలోకి వెళ్తారని, మరోసారి వైసీపీలోకి వెళ్లడం ఖాయమంటూ ప్రచారాలు జోరుగా సాగాయి. కానీ, ఆయన మాత్రం వెళ్లలేదు. జంపింగ్‌ ఖాయమనుకున్న ఆయన ఎందుకు వెళ్లలేదనే దానిపై ఇప్పుడు రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్… తాను నవ్వుతూ అందిరినీ నవ్విస్తూ ఆకట్టుకోవడంలో దిట్ట. బలహీనవర్గాలకు చెందిన నేతగా రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఆయన వైసీపీలో చేరుతున్నారని, జగన్‌ని కలుస్తున్నారంటూ ఒకటే ప్రచారం. ఈ ప్రచారాన్ని మొదట్లో ఆయన ఖండించ లేదు. కార్యకర్తలు ఎన్నిసార్లు ప్రశ్నించినా నోరు మెదపలేదు. వైసీపీ అగ్రనేతలకు సైతం టచ్‌లోకి వెళ్లి చర్చలు జరిపారట. అనగాని పెట్టిన డిమాండ్లను కొన్నిటిని ఓకే కూడా చేశారట వైసీపీ పెద్దలు. ఇక రేపో మాపో క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆఖరి నిమిషంలో వైసీపీకి ఝలక్ ఇచ్చారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

మిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకున్నారట. అనగాని సత్యప్రసాద్ కు తెలంగాణ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయి. మొదట్లో వారి ద్వారానే వైసీపీ అధినాయకత్వానికి టచ్‌లోకి వెళ్లారట. ప్రస్తుతం టీడీపీలో ఉన్న నలుగురైదుగురు ఎమ్మెల్యేలతో అనగాని సన్నిహితంగా ఉంటారు. వారిని ప్రభావితం చేసే శక్తి కూడా ఆయనకు ఉందని అందరూ అంటుంటారు.

మొన్నటి ఎన్నికల్లో అనగానిపై ఓటమి చెందిన మోపిదేవి వెంటకరమణ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గంలో అనగానికి ఒక చిన్న పని కూడా పూర్తి కాని పరిస్థితి ఉందట. అధికార పార్టీలోకి వెళితే నియోజకవర్గంలో తనకు పట్టు వస్తుందని తొలుత భావించారట. పార్టీ మార్పుపై అందరితో చర్చిస్తున్న మీదట కొత్త అనుమానాలు వచ్చాయట.

రేపల్లె నియోజకవర్గంలో పెత్తనం అప్పగిస్తామని వైసీపీ హైకమాండ్ హామీ ఇచ్చినా అది సాధ్యం కాదని భావించారట అనగాని. జగన్‌కు అత్యంత ఆత్మీయుడిగా ఉన్న మోపిదేవిని కాదని తనని ప్రోత్సహించరనే అనుమానం అనగానికి కలిగిందట. మోపిదేవికి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీ పంపినా ఆయన సోదరుడు హరనాథ్‌ని తట్టుకొని నిలబడడం కష్టమని అనగాని భావించారని చెప్పుకుంటున్నారు. సన్నిహితులు ఇంకో కారణం కూడా చెబుతున్నారు.

టీడీపీలో గౌడ సామాజికవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంలో కొనసాగితే భవిష్యత్తులో ఆ సామాజిక వర్గం కోటాలో వచ్చే పదవులు దక్కించుకోవచ్చుననే ఆలోచనలో అనగాని ఉన్నారట. పార్టీ అధినేత చంద్రబాబు సైతం అనగాని రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చారని అంటున్నారు. దీనిలో భాగంగా త్వరలో ఏర్పడబోయే రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అనగాని సత్యప్రసాద్ ఆఖరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించారని చెబుతున్నారు. ఇదంతా తెలుసుకొన్న తెలుగు తమ్ముళ్లు అమ్మో అనగాని ఇంత ఆలోచించారా అనుకొని ముక్కున వేలేసుకుంటున్నారట.