Sunkari Narahari : నరహరి బ్యాంకు లాకర్లు బద్దలుకొట్టిన ఏసీబీ.. భారీగా నోట్ల కట్టలు చూసి షాక్.. రూ. 5 కోట్ల నగదు ఫ్రీజ్!
Narahari Bank Lockers : సుంకరి నరహరి బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు బద్దలు కొట్టారు. ఈ సోదాల్లో కోట్ల నగదుతో పాటు రెండున్నర కిలోల బంగారాన్ని కూడా ఏసీబీ సీజ్ చేసింది.
- Sreehari A
- Updated on- June 20, 2026 / 06:05 PM IST
Narahari Bank Lockers
Sunkari Narahari Bank Lockers : ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన బ్యాంకు లాకర్లలో భారీ నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు.
ప్రత్యేకించి శాలిబండ కెనరా బ్యాంక్ లాకర్‌లోనే కోట్లలో నగదు ఉన్నట్టు తేలింది. ఇటీవల అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో నరహరిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ క్రమంలోనే నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను బద్దలు కొట్టారు. అందులో కీలక ఆధారాలను కూడా సేకరించారు. తొలుత నరహరి కుటుంబ సభ్యులు లాకర్ తాళాలను అందించేందుకు సహకరించలేదు. న్యాయస్థానం అనుమతితో ఏసీబీ అధికారులు సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. బ్యాంకు అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారమే నరహరి లాకర్లను ఓపెన్ చేశారు.
ఈ సోదాల్లో బ్యాంకు లాకర్లలో భారీ మొత్తంలో నగదు, గోల్డ్ ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. నరహరి బ్యాంకు లాకర్లో రూ. 1.50కోట్లు నగదును గుర్తించారు. అలాగే సుమారుగా రెండుకు పైగా కిలోల బంగారం కూడా దొరికింది.
ఎంత మొత్తంలో బంగారం విలువ ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి లాకర్లలో దొరికిన బంగారం, నగదుకు సంబంధించి కీలక పత్రాలను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది.
మరో రెండు బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అధికారులు తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే నరహరి ఇంట్లో కోటి 54 లక్ష రూపాయలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నరహరి బ్యాంక్ అకౌంట్లో రూ. 5 కోట్ల నగదు కూడా ఫ్రీజ్ చేశారు ఏసీబీ అధికారులు.
