భూమా అఖిలప్రియను జైలులో టెర్రరిస్టుకంటే దారుణంగా చూస్తున్నారు : భూమా మౌనిక రెడ్డి

Bhuma Maunika Reddy responds to Bhuma Akhilapriya’s remand : భూమా అఖిలప్రియను జైలులో టెర్రరిస్టుకంటే దారుణంగా చూస్తున్నారని ఆమె సోదరి భూమా మౌనిక రెడ్డి ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా అఖిలప్రియను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రవీణ్‌రావును కొట్టి ఉంటే సాక్ష్యాలు ఏవని ప్రశ్నించారు. రాత్రికి రాత్రి ఏం జరిగింది… ఏ2గా ఉన్న వాళ్లు రాత్రికి రాత్రి ఏ1గా ఎలా మారారని నిలదీశారు. తాము తప్పు చేసి ఉంటే వ్యవస్థ చూసుకుంటుందన్నారు. సివిల్ సమస్యలు ఉంటే తాము చర్చలకు వస్తామని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు చెబుతున్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ రామ్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. హఫీజ్‌పేట్‌ భూ వివాదమే కిడ్నాప్ వ్యవహారానికి ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు.

వ్యాపారవేత్తలైన బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసును తక్కువ సమయంలో చేధించిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. భూమా అఖిలప్రియకు కోర్టు రిమాండ్ విధించగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోసం ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఈ క్రమంలో అఖిల ప్రియ కోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన అనారోగ్య కారణాల దృష్ట్యా, తాను గర్భవతి అయిన కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియ తరఫు న్యాయవాది సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ కోసం వాదనలు వినిపించారు. భూమా అఖిలప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ వాయిదా పడింది. సోమవారానికి సికింద్రాబాద్ కోర్టు వాయివా వేసింది. అఖిలప్రియ హెల్త్ బులెటిన్ ను సోమవారం కోర్టుకు సమర్పించాలని చంచల్ గూడ సూపరింటెండెంట్ ను ఆదేశించింది.