political pressure behind Bhuma Akhilapriya’s arrest : భూమా అఖిలప్రియ అరెస్ట్ వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉండొచ్చని ఆమె సోదరి భూమా మౌనిక రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అఖిలప్రియ విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆరోగ్యం దృష్ట్యా ఒక మహిళ అని చూడకుండా పోలీసులు వ్యవహరించారని వాపోయారు. గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయినా ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. భూవివాదంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి.. ఏ2గా ఎలా మారారని మౌనిక ప్రశ్నించారు. కిడ్నాప్ చేయాల్సిన అవసరం తమకు లేదని భూమా మౌనిక రెడ్డి స్పష్టం చేశారు. భార్గవరామ్ ఎక్కడున్నారో తమకు తెలియదన్నారు. కేసుతో ఏ సంబంధం లేని తమ తమ్ముడిని పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తమపై ఫ్యాక్షన్ ముద్ర వేయొద్దని కోరారు. తాము పుట్టింది కర్నూలు అయినా.. పెరిగింది హైదరాబాద్‌లోనేనని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు.
తమ నాన్న చనిపోయాక హఫీజ్‌పేట్ భూ వివాదంపై ప్రవీణ్‌రావుతో చర్చించామని తెలిపారు. ప్రవీణ్‌రావు తమ ఇంటికి వచ్చి వెళ్లేంత సన్నిహితం ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న తమ అక్కకు ఫిట్స్ వచ్చిందని సూపరింటెండెంట్ ఫోన్ చేశారని తెలిపారు. అరెస్ట్ సమయంలో ఓ మాజీ మంత్రి, మహిళ అని కూడా చూడలేదని వాపోయారు. ఏవీ సుబ్బారెడ్డి, తమ కుటుంబం మధ్య చిన్నచిన్న వివాదాలే ఉన్నాయని తెలిపారు.
భవిష్యత్‌లో భూ వివాదంపై ఎవరైనా పెద్దమనుషులు పరిష్కరిస్తామంటే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇలా ఎందుకు చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. హఫీజ్‌పేట్‌లో భూమి కంపెనీ పేరుతో ఉందని తెలిపారు. కంపెనీలో ఏవీ సుబ్బారెడ్డి, ప్రవీణ్‌రావు, తమ నాన్న భాగస్వాములని భూమా మౌనిక రెడ్డి పేర్కొన్నారు.