నిజంగా తెలంగాణ వాసులు షాకింగ్ న్యూసే. కరోనా వైరస్ ఇప్పటి వరకు వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి సోకుతుందని అనుకుంటున్నారు. కానీ..చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. 12 ఏళ్లలోపు ఉన్న 20 మంది చిన్నారులకు వైరస్ సోకింది. వీరంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ఆసుపత్రిలోని ఆరో అంతస్తులో ICMR నిబంధనల ప్రకారం… వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 23 రోజుల పసికందు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ పసికందుకు వెంటిలెటర్ పై చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. కొన్ని రోజుల వరకు తక్కువగానే కేసులు నమోదయ్యాయి. కానీ ఒక్కసారి రెండు.. మూడు రోజుల నుంచి 50 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో అందరిలో ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నియంత్రణ మండలి రూల్స్ ప్రకారం వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే కొత్తగా 52 కేసులు నమోదయ్యాయి.
దీంతో తెలంగాణలో కరోనా బాధితులు సంఖ్య 644కు చేరింది. మంగళవారం కరోనాతో పోరాడుతూ ఒకరు చనిపోయారు. దీంతో మృతులు సంఖ్య 18కి చేరింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 516 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా చిన్న పిల్లలకు వైరస్ సోకుతుండడంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ చంటి పిల్లలకు వైరస్ ఎలా సోకిందనేది అంతుబట్టడం లేదు. తల్లి నుంచే సోకిందని సమాచారం. వైరస్ చిన్న పిల్లలకు సోకితే జాగ్రత్తగా వైద్యం అందించాల్సి ఉంటుంది. ప్రత్యేక వార్డుల్లో వీరికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితిపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితిపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.