Telangana BJP
Jubilee Hills Bypoll: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు మొదలు పెట్టేసింది. జూబ్లీహిల్స్ స్థానానికి అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, అడ్వకేట్ కోమల ఆంజనేయులుతో త్రిసభ్య కమిటీ వేసింది బీజేపీ. ఇక జూబ్లీహిల్స్ లో అభిప్రాయ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కమిటీ సభ్యులకు ఆదేశించారు.
ఈ నెల మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్న వార్తల నేపథ్యంలో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టింది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు త్రిసభ్య కమిటీని వేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న నాయకులు, స్థానికంగా ఉన్న కార్యకర్తలు, బీజేపీ ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుంది అనేదానిపై కసరత్తు చేయనున్నారు.
బీజేపీ నుంచి చాలా మంది టికెట్ రేసులో ఉన్నారు. అయినప్పటికీ ప్రధానంగా గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, కిలారి మనోహర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనేకమంది పేర్లు వినిపిస్తున్నా టికెట్ ఇచ్చేది ఒకరికే కాబట్టి ఆ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు సాధించే అవకాశం ఉంటుంది అనేదానిపై కసరత్తు చేసి అభ్యర్థిని ఎంపిక చేయనుంది త్రిసభ్య కమిటీ.
క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తలు పని చేస్తున్నారు. బూత్ వెరిఫికేషన్, ఓట్ వెరిఫికేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, అభ్యర్థిగా ఎవరుంటే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అనే అంశాలపై క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారి అభిప్రాయాలు తీసుకోవడం, రాష్ట్రంలోని ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకోవడం, నియోజకవర్గంలోని కీలక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి మూడు పేర్లను రాష్ట్ర నాయకత్వానికి కమిటీ సూచించనుంది. రాష్ట్ర నాయకత్వం ఆ మూడు పేర్లను జాతీయ నాయకత్వానికి పంపుతుంది. ఆ తర్వాత తుది పేరును జాతీయ నాయకత్వం పంపించడం జరుగుతుంది.
ప్రధానంగా దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, ఆకుల విజయ పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో పోటీ చేసిన అనుభవం దీపక్ రెడ్డికి ఉంది. కీర్తి రెడ్డి క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారన్న గుర్తింపు ఉంది. తాను పుట్టి పెరిగిన ఏరియా, స్థానికంగా తనకు బలం ఉందని, సామాజికవర్గం తనకు కలిసి వస్తుందంటూ ఆకుల విజయ చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో తనకే టికెట్ ఇవ్వాలని ఆకుల విజయ అడుగుతున్నారు. గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తారా? కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారా? ఈ ముగ్గురు కాకుండా నూతన అభ్యర్థి ఎవరైనా తెరపైకి వస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: త్వరలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి నియామకం? ఈ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్..