Raghunandan Complaints To Dgp
Raghunandan Complaints To DGP : దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నిన్న జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు తమపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎమ్మెల్యేకు ఉండే ప్రోటోకాల్ ను కూడా లోకల్ పోలీసులు అమలు చేయడం లేదన్నారు. పోలీసుల తీరు సరైంది కాదని ఎమ్మెల్యే రఘునందర్ అన్నారు.
టీఆర్ఎస్ అధికార మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న ఎమ్మెల్యే రఘునందన్… ప్రతిపక్ష నాయకులు భద్రతలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. అందరినీ సమానంగా చూడాలని డీజీపీని కోరామన్నారు. తమ అభ్యర్థనపై డీజీపీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే రఘునందన్ తెలిపారు. విధులు దుర్వినియోగం చేస్తున్న పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు.(Raghunandan Complaints To DGP)
తన నియోజకవర్గం దుబ్బాకలో మినీ కూరగాయల మార్కెట్(గుడికందుల) ప్రారంభానికి వెళ్తే టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. బందోబస్తు కల్పించాలని ఫోన్ చేసి అడిగినా సిద్ధిపేట ఏసీపీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే… వారిపై తమ పార్టీకి చెందిన మహిళలు తిరుగుబాటు చేశారని చెప్పారు. తనపై భౌతికదాడి చేసేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోలేదన్నారు.
టీఆర్ఎస్ పార్టీ సమావేశాల్లో ఇతర పార్టీల నేతలు ఆందోళన చేస్తే పోలీసులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ లో తానుంటే… స్టేషన్ బయట టీఆర్ఎస్ నేతలతో ఏసీపీ సంప్రదింపులు జరిపారని రఘునందన్ రావు మండిపడ్డారు. శిలాఫలకాన్ని కూల్చిన వ్యక్తులను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తనపై దాడికి యత్నించిన వారిపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని అడిగారు. అధికార కార్యక్రమానికి వెళ్లిన తనపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించానని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణం అన్నారు.
G.Kishan reddy: తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి: కిషన్ రెడ్డి
గురువారం పోలీసులపై ఆరోపణలు గుప్పిస్తూ పోలీస్ స్టేషన్‌లోనే రఘునందన్ రావు నిరసనకు దిగారు. రఘునందన్ రావు నిరసనతో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మధ్యాహ్నం సమయంలో పోలీస్ స్టేషన్‌లోనే దీక్షకు దిగిన రఘునందన్ రావు.. 4 గంటలు గడుస్తున్నా.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ వచ్చేదాకా దీక్ష విరమించేది లేదని భీష్మించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉపఎన్నికలో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావు గురువారం మిరుదొడ్డి పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను అడ్డుకున్న మహిళలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన రఘునందన్ రావు తనకు సరిపడ బందోబస్తు కల్పించని కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ వెంటనే ఆయన మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తన పర్యటనలో జరిగిన ఘర్షణకు మిరుదొడ్డి ఎస్ఐ, సీఐలే కారణమని, ఆ ఇద్దరు పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే తనకు బందోబస్తు కల్పించలేదని ఆరోపిస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లోనే నిరసనకు దిగారు.