Karimnagar Mayor : కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన బీఆర్ఎస్.. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం
Karimnagar Mayor : కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నికయ్యారు.
- Harishth Thanniru
- Published On : February 16, 2026 / 11:38 AM IST
Karimnagar Mayor
- కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం
- మేయర్‌గా కొలగాని శ్రీనివాస్
- డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు ఎన్నిక
Karimnagar Mayor : కరీంనగర్ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బిగ్ షాకిచ్చింది. మేయర్ ఓటింగ్ ప్రక్రియకు బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ స్థానంపై పాగావేయాలని భావించిన కాంగ్రెస్ ఆశలు అడియాశలయ్యాయి. కార్పొరేషన్‌లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ మేయర్ స్థానంను దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు ఎన్నికయ్యారు.
కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రయత్నాలు చేశాయి. ఈ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్ అఫీసియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ పేర్కొంది.
అయితే, రాత్రికిరాత్రే బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్ ఒకరు కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లడం.. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై బీజేపీకి మేయర్ పదవి దూరం చేయాలని భావించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ తొమ్మిది, మజ్లిస్ మూడు, ఏఐఎఫ్‌బీ ఇద్దరు, స్వతంత్రులు నలుగురు, ఎక్స్ అఫీసియో ఇద్దరు కలిపి తమకు 34 బలముందని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది.
సోమవారం జరిగిన మేయర్ ఎన్నికల ప్రక్రియకు బీఆర్ఎస్ గైర్హాజరవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకిచ్చింది. దీంతో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కాయి.
