Ponguleti issue : పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. విచారణకు ఆదేశించండి.. గవర్నర్‌‌తో బీఆర్‌ఎస్ బృందం భేటీ

Ponguleti issue : బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

BRS leaders meet Governor_ Complaint against Ponguleti

  • గవర్నర్‌తో బీఆర్ఎస్ బృందం భేటీ
  • పొంగులేటి ఇష్యూపై ఫిర్యాదు
  • పొంగులేటిని బర్తరఫ్ చేసి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి

Ponguleti issue : బీఆర్ఎస్ నేతలు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాతో సోమవారం భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్, ఆయన కుమారుడు హర్షారెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నాడంటూ గవర్నర్‌కు ఆధారాలను బీఆర్ఎస్ బృందం అందజేసింది. అదేవిధంగా ఆదివారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలను, బీఆర్ఎస్ సభ్యుల సస్సెన్షన్ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంధ్రారెడ్డి, సునీతారెడ్డితోపాటు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌తో  భేటీ అయిన వారిలో ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

Also Read : E-3 Sentry : ఇరాన్ కూల్చిన అమెరికా ‘బోయింగ్ ఈ-3 సెంట్రీ’ ప్రత్యేకతలు ఇవే..

రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రాఘవ కన్ స్ట్రక్షన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, ఈ మేరకు గవర్నర్ కు ఆధారాలు అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. పొంగులేటి కుటుంబం రెండున్నరేళ్లుగా ప్రజా సంపదను దోచుకుందని, మంత్రి పొంగులేటి అవినీతిని కప్పిపుచ్చి ఆయన్ను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా పార్టీ నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో పొంగులేటి విషయాన్ని లేవనెత్తితే ఎదురుదాడి చేశారు. అక్రమ మైనింగ్ పై సీబీసీఐడీ విచారణ చేయిస్తాం అని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశాము. హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరంగా ఉంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇక్కడేమో హౌస్ కమిటీలకు విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంత వరకు సబబు అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు, ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలను తుంగలోతొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారని, ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్నారని.. ఇందుకు సంబంధించిన వివరాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు.

తాజా పరిణామాలపై జోక్యంచేసుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థతో విచారణకు ఆదేశించాలని గవర్నర్ ను కోరడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించారని కేటీఆర్ అన్నారు.