Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha: కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరిగనివ్వవద్దంటూ ప్రజలను కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. 60ఏళ్ళ పాటు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు.
రైతులు సంతోషంగా ఉండాలంటే నాణ్యమైన విద్యుత్ ఉండాలి. కేసీఆర్ రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు, కాళేశ్వరంతో నీళ్లు ఇస్తున్నారు. దేశంలో రైతుబంధు ఎక్కడా లేదు.. కేసీఆర్ రైతుబంధును నకల్ కొడుతున్నారని కవిత అన్నారు. తెలంగాణ రైతాంగానికి దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బోకస్ అన్నట్లు రేవంత్ మాటలతో అర్థం అయిందని కవిత అన్నారు. 24 గంటల కరెంట్ రైతులకు ఎందుకు ఇవ్వొద్దు.. రేవంత్ రెడ్డికి పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం ఉందా? అంటూ కవిత ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో రేవంత్ రెడ్డి ఉన్నారు.. ఆ రెండు పార్టీలు రైతులకు సరైన విద్యుత్ ఇవ్వలేదని కవిత విమర్శించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు కడుపు మంట? మూడు పూటలా అన్నం పెట్టే రైతులకు మూడు గంటలే కరెంట్ ఇవ్వాలనే రేవంత్ రెడ్డిని ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు
ఆనాడు కాంగ్రెస్ పాలనలో అర్థరాత్రి కరెంట్ వస్తే పొలాలకువెళ్లి పాము కాటుకు మరణించారు. ఎవరైనా చనిపోతే కరెంట్ అధికారులను బతిమిలాడి కరెంట్ వేయించుకున్నాం అని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరుగానియ్యవద్దంటూ రైతులకు కవిత పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే రేవంత్ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోవాల్సి వస్తుందని కవిత హెచ్చరించారు.