Ktr: రేవంత్ రెడ్డి సినిమా వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, తెరవెనుక మాఫియా శక్తులు చెలరేగిపోతున్నాయని కేటీఆర్(Ktr) ఆరోపించారు.
- V Santhosh Kumar
- Updated on- June 21, 2026 / 03:44 PM IST
Brs party ktr fire on Revanth Reddy government in Telangana
- జయశంకర్ సార్‌కు కేటీఆర్ నివాళులు.
- రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్.
- కాంగ్రెస్ భూదందాలపై తీవ్ర విమర్శలు.
Ktr: తెలంగాణ అస్తిత్వ పోరాట ప్రతీక ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి వేళ, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, తెరవెనుక మాఫియా శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే మంత్రులంతా చేతులు కలిపి రాష్ట్ర సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ, దాచుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Delhi Parking Dispute: బైక్ పార్కింగ్ వివాదం.. దంపతులపై కత్తితో దాడి.. మహిళ మృతి
సమకాలీన రాజకీయాన్ని సినిమా రంగుల ప్రపంచంతో పోలుస్తూ కేటీఆర్ వినూత్న విమర్శలు చేశారు. వెండితెరపై ‘అర్జున్ రెడ్డి’ ప్రభంజనం సృష్టిస్తే, ఇటు నిజజీవితంలో ‘రేవంత్ రెడ్డి’ అనే చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ పాలన అనే సినిమా మొదటి భాగం ముగిసేసరికే ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ముగుస్తుందా అని వేచి చూస్తున్నారని అన్నారు. ఒక చలనచిత్రం విఫలమైతే కేవలం కొద్దిమంది పెట్టుబడిదారులకే నష్టం వస్తుందని, కానీ ఒక ముఖ్యమంత్రి వైఫల్యం వల్ల కోట్లాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సాగుతున్న భూ అక్రమాలను ప్రస్తావిస్తూ శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక బాధితుడి ఉదాహరణను ఆయన పంచుకున్నారు. తన వివాహ పత్రికను అందించేందుకు వచ్చిన సదరు వ్యక్తి, తన పూర్వీకుల భూమిని అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చారని కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ భూమిని విడిపించాలంటే అధికార పక్ష నేతలు ఎకరానికి కోటి రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని సదరు రైతు వాపోయాడన్నారు. వచ్చే రెండేళ్లూ ఎలాగోలా తన భూమిని కాపాడుకుంటానని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాధితుడు కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
